బెంగళూరు: కర్ణాటకలో జంట హత్యలు కలకలం రేపాయి. గ్రామ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్‌తో పాటు ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన అనేకల్‌లోని సూర్యనగర్ సమీపంలోని బ్యగడదేనహళ్లిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణస్వామి (38), కావ్య (28) బ్యగడదేనహళ్లికి చెందిన వారు. నారాయణస్వామి గ్రామ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ కావడం గమనార్హం. కావ్యకు బ్యగడదేనహళ్లి గ్రామానికి సమీప గ్రామంలో ఉండే ముత్తురాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా సఖ్యత లోపించినట్లు తెలుస్తోంది. నారాయణ స్వామితో కావ్య వివాహేతర సంబంధం నడుపుతోందని ముత్తురాజ్ భావించాడు.
భార్య తనతో ఉండటం కంటే సొంతూరులో ఉండేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం, నారాయణ స్వామి, కావ్య మధ్య పరిచయం ఉండటంతో ముత్తురాజ్ అనుమానం మరింత పెరిగింది. ఈ క్రమంలో.. కావ్య, ఆమె తల్లి సాయంత్రం వాకింగ్‌కు వెళుతుండగా సాయంత్రం 7 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. కావ్యను అడ్డగించి ఆమెను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అదే మాదిరిగా నారాయణ స్వామి కూడా అదే రోజు దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో.. ఈ జంట హత్యల గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
నారాయణ స్వామి, కావ్య మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ముత్తురాజ్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలకు ముత్తురాజ్‌కు మరికొంత మంది సహకరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కావ్య పుట్టిల్లు బిజీగా ఉండే రోడ్డు పక్కనే ఉంటుంది. హత్య జరిగిన రోజు కావ్య ఇంటి వైపు గుర్తుతెలియని వ్యక్తులు వెళుతుండటాన్ని గమనించినట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. నారాయణస్వామితో కావ్య చనువుగా ఉంటున్న విషయం వాస్తవమేనని పోలీసుల విచారణలో తేలింది.
ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని, ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో కావ్యకు, ఆమె భర్త ముత్తురాజ్‌కు మధ్య గొడవలు మొదలయినట్లు తెలిసింది. భార్య గంటలుగంటలు ఫోన్ కాల్స్‌తో బిజీగా ఉండటం, పుట్టింటికి వెళ్లి వారాలకు వారాలు అక్కడే గడిపేస్తుండటంతో కావ్య భర్తకు ఆమె వివాహేతర సంబంధం గురించి తెలిసిపోయిందని, నారాయణ స్వామి, కావ్య కలిసి బైక్‌పై కలిసి వెళుతుండటాన్ని కూడా పలుమార్లు చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో.. తన భార్య కావ్యపై, నారాయణస్వామిపై పగ పెంచుకున్న ముత్తురాజ్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ జంట హత్యలతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో కావ్య, నారాయణ స్వామి హత్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.