ప్రస్తుత రోజుల్లో కొందరు యువతీయువకుల క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాలనే తలకిందులు చేస్తున్నాయి. వాళ్లు చేసిన తప్పు తెలుసుకునే లోపే జీవితాలు నాశనమైపోతున్నాయి. దీంతో వాళ్లను నమ్ముకున్న కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్న కొందరు కన్న తల్లిదండ్రులు గురించి ఆలోచించకుండా తమ దారి తాము చూసుకుంటున్నారు. మరికొంత మంది చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆ రొంపి నుంచి బయటపడేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు.
అది తప్పని తెలిసి ఆ తర్వాత కొంతమంది పశ్చాతపడుతున్నార.. కొంతమంది ఇది తప్పని తెలిసినా తప్పని పరిస్థితుల్లో చేస్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో ఓ యువతి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఇది కూడా అదే కోవలోకి చెందుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలపరిధిలోని కాళ్లకల్ గ్రామంలో పర్స కృష్ణయ్య, కనకవ్వ అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్లకు ఇక కొడుకు నవీన్, కుమార్తె కల్యాణి ఉన్నారు.
వాళ్ల కుమార్తె కల్యాణి వాళ్లతో పాటే ఇంట్లోనే ఉంటోంది. శనివారం రాత్రంతా సరదాగా మాట్లాడుకొని.. తదనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి నిద్రించారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి కుమార్తె అదృశ్యమైంది. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిందని.. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపాడు. ఆదివారం తెల్లవారుజామున కృష్ణయ్య లేచి చూసేసరికి కుమార్తె కనిపించలేదు.
దీంతో ఆందోళన చెందిన అతడు బంధువులు, ఇరుగుపొరుగు ఇండ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో మనోహరాబాద్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆమె వద్ద ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేదా ఎవరినైనా ప్రేమించి వాళ్లతో వెళ్లిపోయిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మరో ఘటనలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి డివిజన్లోని పాపిరెడ్డి కాలనీలో దేవికారాణి, రాజేష్ అనే భార్యాభర్తలు గత ఆరు నెలలుగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరికి ఉజ్జయిని అనే 18 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఆమె డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆ యువతికి ఓ విషయంలో తల్లిదండ్రులతో గొడవ జరిగింది. తండ్రి రాజేష్ కూతురిని మందలించాడు. దీంతో.. ఉజ్జయిని తీవ్ర మనస్తాపం చెందింది. ఇక ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుంది. ఆమె పోతూపోతూ డైరీలో ఒక వాక్యం రాసి ఇంట్లో ఉంచి వెళ్లిపోయింది. ‘మమ్మీ నేను బ్రతకడానికి వెళుతున్నాను.. నన్ను వెతకకండి’ అని అందులో రాసి వెళ్లింది. ఈ ఘటన జరిగి కూడా దాదాపు 20 రోజలు కావస్తోంది. ఇలాంటి ఘటనలు రోజూ ఏదో ఒక ప్రదేశంలో జరుగుతూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Medak Dist, Missing cases