రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పోలీసులు ఘరానా మోసగాడిని వలపన్ని పట్టుకున్నారు. తమ తెలివి తేటల ద్వారా బ్యాంకులకు మోసం చేసి కోట్లాది రూపాయలను దండుకున్న దంపతులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన వివరాలను షాద్నగర్ ఏసీపీ వి. సురేందర్ మీడియాకు బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ లోని కు చెందిన పబ్బతి ప్రభాకర్ అతని భార్య పబ్బతి సరిత ఇరువురు కలిసి పలు బ్యాంకులను ఇంటి స్థలాలు, ఇండ్ల రుణాల పేరిట మోసం చేశారు. అంతేకాకుండా కొంతమంది రియల్ వ్యాపారులను సైతం బోల్తా కొట్టించి తమ తెలివితేటలతో సునాయాసంగా సుమారు రూ.25 కోట్లకు పైగా డబ్బులను మోసం చేశారు. వీటికి సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదై ఉన్నాయని ఏసీపీ సురేందర్ తెలిపారు.
ఇదిలా ఉండగా షాద్నగర్ ఇండియన్ బ్యాంకులో రూ. 5 కోట్ల 30 లక్షల రుణాలు తీసుకొని మోసం చేశారు. అప్పటి బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడట్టు పోలీసు విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ ఆదిత్య విలాస్ లో పోలీసులు సోదాలు జరిపారు. ఈ సమయంలో పోలీసులను అడ్డుకున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజామున ప్రభాకర్ అతని భార్య సరితను అదుపులోకి తీసుకొని షాద్నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
అదే విధంగా దివాకర్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి తదితరుల వద్ద సుమారు రూ.25 కోట్ల వరకూ మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. వారు కూడా అతని కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిసింది. ఎట్టకేలకు షాద్ నగర్ పోలీసులు పబ్బతి ప్రభాకర్ దంపతులను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిని బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు సురేందర్ స్థానిక మీడియాకు తెలిపారు. దంపతులు ఇంకా ఏయే బ్యాంకులో మోసం చేశారు..? వీరితో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? అన్న విషయంలో దర్యాప్తు జరుపుతున్నారు. పబ్బతి ప్రభాకర్ సొంత గ్రామం ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామం అని పోలీసులు తెలిపారు. అతని తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అతను హైదరాబాదులో డిగ్రీ చదువినట్టు పోలీసులు చెప్పారు. అదేవిధంగా అతనిపై సైబరాబాద్ పోలీసులు కూడా పీడీ యాక్ట్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shamshabad, Telangana Police