మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ (CBI) దర్యాప్తు దాదాపు పూర్తైందనుకున్న తరుణంలో హత్య కేసులో మరొకరి పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో కీలకంగా మారిన పులివెందులకు చెందిన భరత్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశాడు. మర్డర్ వెనుక వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దెవిరెడ్డి శంకర్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లను డ్రైవర్ దస్తగిరి వెల్లడించడంతో కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా భరత్ యాదవ్.. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఈ హత్య చేయించినట్లు చెప్పి మరో బాంబు పేల్చాడు. ఆస్తికోసమే హత్య జరిగిందని వెల్లడించాడు.
వైఎస్ వివేకానందరెడ్డికి షమీమ్ అనే మహిళతో సంబంధముందని... వివేకా తన ఆస్తిని ఆమెకు ఇచ్చేసారన్న అనుమానంతో అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఈ హత్య చేయించారని భరత్ యాదవ్ ఆరోపించారు. హత్య విషయం సునీల్ గతంలో తనకు చెప్పాడని వెల్లడించాడు. ప్రాణభయంతోనే ఇన్నాళ్లు ఈ విషయాలు బయటపెట్టలేదని చెప్పాడు. అంతేకాదు హత్య గురించి సీబీఐ తానే మొదట చెప్పానని కూడా పేర్కొన్నాడు. తాజా ఆరోపణలతో కేసు అనుకోని మలుపు తిరిగింది.
ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతి రోజు ఆయన కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. వివేకాను ఎవరు, ఎందుకు చంపారో ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ కు తెలుసని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్, శివప్రకాష్ రెడ్డిని విచారించాలన్నారు. అంతేకాదు ఇందులో తనకు గానీ, ఎంపీ అవినాష్ రెడ్డికి గానీ, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి గానీ ఎలాంటి సబంధం లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారులను పదేపదే ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు. ఇక హత్యకు టీడీపీ నేత బీటెక్ రవి కుట్ర చేశారని.. రాజకీయంగా అడ్డుగా ఉంటారనే చంపేశారని కూడా ఆరోపించారు.
ఈ కేసులో వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి అన్ని విషయాలు వెల్లడించడంతో దానినే పరిగణలోకి తీసుకున్న సీబీఐ దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత శంకర్ రెడ్డి, ఇప్పుడు భరత్ యాదవ్ చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు దస్తగిరి అప్రూవర్ పిటిషన్ కు కౌంటర్ గా ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్, సునీల్ యాదవ్ దాఖలు చేసిన కౌంటర్ ను న్యాయస్థానం సోమవారం విచారించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CBI, Ys viveka murder case