అతనొక హెడ్ మాస్టర్. పని చేసేది మారుమూల పల్లెటూరు. ఆ గ్రామంలో పిల్లలందరికీ మంచి విద్యను అందించి.. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉన్నది. కానీ సదరు హెడ్ మాస్టర్ అలా చేయలేదు. కీచక పనులు చేస్తూ.. పిల్లలు బడికి రావాలంటేనే జంకేలా చేశాడు. పిల్లలకు చదువు నేర్పాల్సిన వ్యక్తే.. వారి బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్నాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన వారిపైనే.. అనుచితంగా వ్యవహరించిన ఆ కీచక ఉపాధ్యాయుడి అకృత్యాలు ఆలస్యంగా బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాలోని లక్షిదేవిపల్లి మండలం చింతవర్రె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దొడ్డ సునీల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుతర బాధ్యతను నెత్తినెత్తుకున్న ఆయన.. అందుకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. పాఠాలు చెప్పాల్సిన గురువే... సరస్వతి నిలయం సాక్షిగా వంకర బుద్ధి చూపించాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వాడే విపరీత చర్యలకు పాల్పడ్డాడు.
సదరు హెడ్ మాస్టర్... విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నారులు బడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. దీనిని భరిస్తూ పాఠశాలలకు వెళ్తున్న పిల్లలేమో అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కామాంధుడి చిత్రహింసలు తల్లిదండ్రులకు చెప్పలేక.. బడికి వెళ్లలేక పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురవుతూ నరకయాతనకు గురవుతున్నారు.
ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలకు ఇలా ఎందుకు జరుగుతుందని ఆరా తీయడంతో కీచక ఉపాధ్యాయుడి అకృత్యాలు మెల్లగా బయటపడ్డాయి. దీంతో అక్కడి గ్రామస్థులు కామాంధుడికి దేహశుద్ది చేశారు. సునీల్ పై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. సునీల్ పై విచారణకు ఆదేశించిన అధికారులు... అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Crime, Crime news, Khammam, Teacher misbehave, Telangana