తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన 2001నాటి శరవణ భవన్ హోటల్ ఉద్యోగి హత్య కేసులో ఆ హోటల్ అధిపతి ఆర్.రాజగోపాల్‌కి సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన శిక్షను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. 2001లో తమిళనాడులో జరిగిన జీవ జ్యోతి భర్త ప్రిన్స్ శాంతకుమార్ దారుణ హత్యకు గురైయ్యాడు. ప్రిన్స్ శాంతకుమార్ శరవణ భవన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చాడు. జ్యోతిష్య పండితుడి సూచన మేరకు జీవ జ్యోతిని మూడో భార్యగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రాజగోపాల్...ఓ పథకం ప్రకారం శాంతకుమార్ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆ మేరకు ఎనిమిది మంది కిరాయి హంతకులతో ప్రిన్స్ శాంతకుమార్ని కిడ్నాప్ చేయించి, హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ హత్య కేసుపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు రాజగోపాల్‌పై నేరాభియోగాలు నిర్ధారించింది. ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ 2004లో తీర్పు ఇచ్చింది. అయితే మద్రాస్ హైకోర్టు రాజగోపాల్‌తో పాటు మరో ఐదుగురు నిందితులకు విధించిన పదేళ్ల జైలుశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుతూ 2009లో తీర్పు వెలువరించింది. మరో ముగ్గురు నిందితులకు రెండేళ్ల కారాగార శిక్ష విధించింది.
దీనిపై రాజగోపాల్, సహ నిందితులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోగా...జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ విచారణ జరిపింది. జీవజ్యోతి భర్త హత్య కేసులో ప్రధాని నిందితుడైన రాజగోపాల్‌తో పాటు ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయినవారికి మద్రాస్ హైకోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించింది. ఈ హత్య కేసులో రాజగోపాల్ ప్రమేయం ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిర్ధారణ అయినట్లు బెంచ్ గుర్తుచేసింది. ఆయన్ను జీవితాంతం కారాగారంలో ఉంచడమే సరైనదిగా అభిప్రాయపడింది. 72 ఏళ్ల రాజగోపాల్ కోర్టు ఎదుట లొంగిపోయేందుకు జులై 7 వరకు సుప్రీంకోర్టు గడవు ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Supreme Court