ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. పచ్చటి కాపురంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఈ వ్యవహారాలతో విడాకులు తీసుకోవడమే కాదు...చంపుకునే వరకు వెళ్తున్నారు దంపతులు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. భర్తను తుపాకీతో కాల్చి..తీవ్రంగా గాయపరిచింది ఓ మహిళా ఇన్స్పెక్టర్. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భతాపారా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐతే భార్యాభర్తలిద్దరూ రైల్వే ఉద్యోగులు కావడం విశేషం.
సునీత మింజ్ (39) అనే మహిళ భతాపారా రైల్వే స్టేషన్లో RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త దీపక్ శ్రీవాస్తవ (42) సైతం రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఐతే కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు దీపక్. వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతోందన్న అనుమానంతో నిలదీశాడు. ఈ విషయమై ఇరువురి మత్య నిత్యం వాగ్వాదం జరిగేంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది పరిస్థితి. దాంతో సునీత సర్వీస్ రివాల్వర్ తీసి భర్తపై కాల్పులు జరిపింది.
మొదట ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపాక..తర్వాతి రెండు రౌండ్లు దీపక్‌ను కాల్చింది సునీత. అతడి తొడభాగంలో బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీపక్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి సునీత మింజ్ని అరెస్ట్ చేశారు.