ROWDYSHEETER WHO RAPED TWO GIRLS IN VIZIANAGARAM SNR VZM
Vizianagaram:ఇద్దరు ఇంటర్ బాలికలపై అత్యాచారం..బాయ్‌ఫ్రెండ్స్‌తో ఉన్న టైమ్‌లో అఘాయిత్యం
Vizianagaram
Vizianagaram: న్యూఇయర్ రోజున ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. క్లాస్‌మెట్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన అమ్మాయిలను ఓ రౌడీషీటర్ బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే వాళ్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు.
ఆడపిల్లలు కనిపిస్తే చాలు..కామాంధులు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. మైనర్లు, వివాహితులు, వృద్ధులు అనే తేడా లేకుండా వారిపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. విజయనగరం(Vizianagaram)లో జిల్లాలో ఓ కామాంధుడు ఇద్దరు మైనర్ (Minors)బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బయటపెట్టవద్దని..ఎవరికైనా చెబితే వాళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసిన ఘటన సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా కురుపాం (Kurupam)మండలంలో ఈ దారుణం జరిగింది. కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గ్ళహంలో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు గిరిజన మైనర్ విద్యార్ధినులు. శనివారం నూతన సంవత్సరం సెలవు కావడంతో.. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. తమ స్నేహితులైన ఇద్దరు విద్యార్ధులతో కలిసి జియ్యమ్మవలస మండలం రావాడ సమీపంలోని వట్టిగడ్డ డ్యామ్ వద్దకు వెళ్లారు. కాసేపు స్నేహితులతో కలసి సరదాగా గడిపారు. ఇంతలో జియ్యమ్మవలస మండలం చిరమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు అనే 32 ఏళ్ల పాత నేరస్తుడు.. డ్యామ్ సమీపంలో ఇద్దరు గిరిజన విద్యార్ధినులు, తమ స్నేహితులతో ఉండడాన్ని గమనించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో దుర్భుద్దితో .. ఇద్దరు విద్యార్ధినులు వాళ్ల స్నేహితులతో క్లోజ్ గా ఉండడాన్ని ఫోటోలు, వీడియోలు తీసాడు.
మైనర్ బాలికలపై అత్యాచారం..
అక్కడే ఉండి గమనిస్తున్న రాంబాబు.. బాలికలు డ్యామ్ నుండి తిరిగి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో అడ్డగించాడు. వాళ్లతో పోలీసునని చెప్పి బెదిరించిన దుండగుడు వెలగాడ రాంబాబు, తాను చెప్పినట్టు వినకపోతే.. వీడియోలు, ఫోటోలు తీసానని బెదిరించడం మొదలుపెట్టాడు. బాలికలతో వచ్చిన ఇద్దరు స్నేహితులను అక్కడే కూర్చొబెట్టి.. మైనర్ బాలికలను ఇద్దరినీ బైక్ మీద ఎక్కించుకున్నాడు. ఇద్దరినీ దూరంగా ఉన్న పామాయిల్ తోటల్లోకి తీసుకెళ్లి, భయపెట్టి వారిపై ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు వెలగాడ రాంబాబు. విషయం బయటకి చెప్తే సోషల్ మీడియాలో ఫోటోలు, ఫోటోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. అనంతరం అక్కడి నుండి రాంబాబు బండిపై వెళ్లిపోగా.. ఇద్దరు విద్యార్ధినులు సాయంత్రం 7 గంటల సమయంలో కురుపాం లోని హాస్టల్ కు చేరుకున్నారు. ఇద్దరు విద్యార్ధినులు భోజనానికి రాకపోవడంతో.. తోటి విద్యార్ధినులు ఏం జరిగిందోనని అడగడంతో.. జరిగిన ఘటనపై కన్నీరుమున్నీరుగా విలపించిన విద్యార్ధినులు.. విషయం మొత్తం చెప్పారు. ఇక విషయం మొత్తం హాస్టల్ మ్యాట్రిన్ కు చెప్పడంతో.. కురుపాం పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కురుపాం పోలీసులు హాస్టల్ కు చేరుకొని విచారణ మొదలు పెట్టారు. డ్యాం నుండి తిరిగి వస్తున్న సమయంలో తమను అడ్డగించి, పోలీసునని చెప్పి బెదిరించి తమపై అత్యాచారం చేసినట్లు బాధితులు పోలీసులకు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
కటకటాల వెనక్కి కామాంధుడు..
విషయం సీరియస్ కావడంతో.. విచారణ చేపట్టిన పోలీసులు.. స్ధానిక పార్వతీపురం డీఎస్పీ సుభాష్ కు సమాచారం అందించారు. ఆయన కూడా రాత్రి 9 గంటల సమయంలో హాస్టల్ కు చేరుకొని విచారణ చేసారు. ఇక జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు విద్యార్ధినులు ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అనంతరం ఇద్దరు మైనర్ విద్యార్ధినులను వైద్య పరీక్షలు కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలికలు ఇచ్చిన సమాచారంతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై గతంలో రౌడీ షీట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు.. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి.. రిమాండ్ కోసం కోరనున్నారు. పోక్సో యాక్ట్ వంటి మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. బాధిత మైనర్లు ఇద్దరూ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీకి చెందిన గిరిజన బాలికలుగా గుర్తించారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.