విశాఖలో కలకలం రేగింది. రియల్టర్ ను రౌడీ షీటర్ కత్తులు, డమ్మీ పిస్టల్ తో బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రౌడీ షీటర్ ను అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా ఉండే సాగరనగరం విశాఖలో ఈ మధ్యకాలంలో ల్యాండ్ సెటిల్మెంట్లు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో హత్యాయత్నాలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంకు చెందిన రియల్టర్ పీఎస్ రాజుకు సంతోష్ అనే రౌడీ షీటర్ తో వివాదం ఉంది. ఓ భూవివాదంలో రాజు కారణంగానే జైలుకెళ్లానని సంతోష్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో అతన్ని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో రాజును చంపేందుకు లోవరాజు అనే మరో రౌడీ షీటర్ కు సుపారీ ఇచ్చాడు. పక్కా స్కెచ్ వేసి రాజును ఓ గదిలో బంధించిన లోవరాజు, సంతోష్ అతడ్ని కత్తులు, డమ్మీ పిస్టల్ తో బెదిరించి రూ.9.60 లక్షలు లాక్కున్నారు.
రౌడీ షీటర్ల బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న పీఎస్ రాజు.. దువ్వాడ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంతోష్, లోవరాజుతో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కత్తి, డమ్మీ పిస్టల్, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. రాజుపై హత్యాయత్నానికి కేవలం వ్యక్తిగత కక్షలే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో సెటిల్మెంట్లు, హత్యాయత్నాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పోలీసుల వరకు వెళ్తుండగా.. మరికొన్ని వెలుగులోకి రావడం లేదు. దీంతో పోలీసులు నగరంలో రౌడీషీట్ ఉన్నవారు, నేరాలకు పాల్పడుతున్నవారిపై కన్నేసి ఉంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime, Crime news, Visakhapatnam, Vizag