ROAD ACCIDENT KILLED TWO FRIENDS IN VIZIANAGARAM DISTRICT ONE OF THEM WAS NEWLY MARRIED FULL DETAILS HERE HSN
Andhra Pradesh: ఆరు నెలల క్రితమే అతడికి పెళ్లి.. ఓటు వేసేందుకు ఇద్దరు ఫ్రెండ్స్ తో ఒకే స్కూటీపై.. రెండు లారీలను ఓవర్‌టేక్ చేయబోయి..
ప్రమాదం జరిగిన స్థలం
ఆ కుర్రాడికి ఆరు నెలల క్రితమే పెళ్లయింది. కుటుంబానికి అతడే జీవనాధారం కూడా. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో ఓటు వేసేందుకు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి శవమై తిరిగొచ్చాడు.
వాళ్లు ముగ్గురూ స్నేహితులు. ఏపీలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముగ్గురూ కలిసి ఒకే స్కూటీపై బయలుదేరారు. పోలింగ్ కేంద్రం వద్ద భారీగా క్యూ కనిపించింది. కొద్ది గంటల తర్వాత మళ్లీ వద్దామని బయటకు వెళ్లారు. కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్నపాటి సిటీకి స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా రెండు లారీలు కనిపించాయి. ఒకదాని పక్కన మరొకటి వెళ్తున్న ఆ లారీలను ఓవర్ టేక్ చేయబోయారు. కానీ ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తృటిలో ప్రాణాలను దక్కించుకున్నాడు. మరణించిన వారిలో ఓ వ్యక్తికి ఆరు నెలల క్రితమే పెళ్లి కావడంతో బంధువుల్లో రోధనలు మిన్నంటాయి. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని మాల నందిగాం గ్రామానికి చెందిన పట్టా మల్లేషు, చింకా దుర్గా ప్రసాద్, పట్టా పవన్ కుమార్ అనే ముగ్గురు యువకులు స్నేహితులు. పట్టా మల్లేసు హెచ్‌బీఎల్ పరిశ్రమలో పనిచేస్తుంటాడు. అతడికి ఆరు నెలల క్రితమే పెళ్లయింది. కుటుంబానికి అతడే జీవనాధారం. చింకా దుర్గా ప్రసాద్ ది వాస్తవానికి తణుకు. కానీ కొన్నేళ్ల క్రిందంటే నందిగాం గ్రామానికి వలస వచ్చారు. తండ్రి మరణించిన తర్వాత విజయనగరం వీటి అగ్రహారానికి మకాం మార్చినా నందిగాం గ్రామంలోని స్నేహితులతో మాత్రం ఎప్పుడూ టచ్ లో ఉండేవాడు. అతడికి ఓటు హక్కు నందిగాం గ్రామంలోనే ఉండటంతో గురువారం జరిగిన ఎన్నికలకు ఆ ఊరికి వెళ్లాడు. తన స్నేహితులయిన మల్లేసు, మరో స్నేహితుడు పవన్ కుమార్ తో కలిసి దుర్గా ప్రసాద్ ఓటు వేసేందుకు ఒకే స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు.
పోలింగ్ కేంద్రంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో భోగాపురం వెళ్లి కొద్ది గంటల తర్వాత తిరిగి వద్దామనుకున్నారు. అక్కడ పని పూర్తి చేసుకుని అదే స్కూటీపై తిరిగి నందిగాం గ్రామానికి వస్తున్నారు. అయితే వారికి ఎదురుగా రెండు లారీలు పక్క పక్కనే వెళ్తున్నాయి. వాటిని ఓవర్‌టేక్ చేయబోయి స్కూటీ ప్రమాదానికి గురయింది. సుమారు 30 మీటర్ల దూరం పాటు స్కూటీని లారీ ఈడ్చుకుపోయింది. దీంతో పట్టా మల్లేషు, చింకా దుర్గా ప్రసాద్ మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. పవన్ కుమార్ రోడ్డుపై తూలి పడటంతో ప్రాణాలతో బయటపడగలిగాడు. విషయం తెలిసిన భోగాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందిగాం గ్రామంలో విషాదచాయలు కనిపించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.