కొద్ది క్షణాల్లో న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టనున్న వేళ హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ ను ఢీ కొని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్కడిక్కడే చనిపోయాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మెయిన్ రోడ్డుపై రాజు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగా అతివేగంగా బైక్ పై వెళ్తూ మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టాడు. అయితే ప్రమాదంలో అతను అక్కడకక్కడే దుర్మరణం చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.
ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పరువు కోసం కన్నకూతురి మెడలో తాళికట్టిన యువకుడ్ని దారుణంగా చంపించారు ఆమె తల్లిదండ్రులు. పట్టపగలు నడిరోడ్డుపై అల్లుడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా, నందవరం మండలం, గురజాలకు చెందిన డేవిడ్ స్మిత్ అదే గ్రామానికి చెందిన మల్లీశ్వరీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని ఇరువురు తమ తల్లిదండ్రులతో చెప్పారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. అయినా నేను డేవిడ్ స్మిత్ నే పెళ్లి చేసుకుంటానని మల్లీశ్వరి తెగేసి చెప్పడంతో తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెను గృహనిర్బంధం చేశారు. దీంతో ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు.
అనుకున్నట్లుగానే గత నెల 13న ఇంట్లో నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆదోనిలో కొత్త కాపురం పెట్టారు. డేవిడ్ స్మిత్ స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్ లో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే డ్యూటీ కోసం హాస్పిటల్ కు వెళ్తుండగా.. మార్గ మధ్యలో దుండగులు అతడ్ని అడ్డగించారు. తొలుత ఇనుపరాడ్డుతో తలపై కొట్టి ఆ తర్వాత రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ డేవిడ్ స్మిత్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న మల్లీశ్వరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులే తన భర్తను హత్య చేయించారని ఆమె ఆరోపిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.