కొంతకాలంగా లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించిన ఉదంతాలు అనేక వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీటి వేధింపులు తట్టుకోలేక తెలంగాణలో కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. ఇప్పటికే ఇలాంటి యాప్స్ ప్రతినిధుల వేధింపులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించగా... తాజాగా దీనిపై ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా స్పందించింది. ఆర్బీఐ, ఎన్బీఎఫ్సీ నిబంధనలకు లోబడి ఉన్న సంస్థల దగ్గరే రుణాలు తీసుకోవాలని సూచించింది. కొన్ని యాప్స్ అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్టు తమకు తెలిసిందన్న ఆర్బీఐ... సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్ల మాయలో పడొద్దని సూచించింది. లోన్ యాప్స్ కోసం వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంది. ఇక ఈ తరహా యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్ సైట్లో ఫిర్యాదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
ఇక లోన్ యాప్స్ కారణంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.ఢిల్లీలో ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు, హైదరాబాదులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యాప్ లోన్ సంస్థలకు చెందిన 2 టెలికాలర్ విభాగాల్లో సోదాలు చేసి 11 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు.
మరోవైపు ఇదే అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించారు. బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నోయిడా, ఢిల్లీ, గుర్గావ్ ల నుంచి ఈ మనీ లోన్ యాప్లు నిర్వహిస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. మొబైల్ లోన్ యాప్ల వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నామని వెల్లడించారు.
యాప్ నిర్వాహకుల ఆగడాలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధిపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ యాప్స్ బాధితులు వేలల్లో బయటకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమైన సందర్భగా మైక్రో ఫైనాన్స్ యాప్ ఆగడాలపై సీఎం స్పందించారు. యాప్ ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలిచ్చి ప్రజల్ని వేస్తున్న అక్రమార్కులను విడిచిపెట్టొద్దని ఆదేశించారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎంతటివారున్నా ఉపేక్షించవద్దని ఆదేశించారు.
Published by:Kishore Akkaladevi
First published:December 23, 2020, 16:21 IST