సుప్రీంకోర్టు ముంబైలోని డ్యాన్స్ బార్లపై కీలక తీర్పు వెలువరించింది. తాజాగా వెలువరించిన తీర్పు ప్రకారం బార్లలో ఇక స్వేచ్ఛగా మందుకొట్టొచ్చు, యథేచ్ఛగా చిందులేయొచ్చు... కావాలంటే డ్యాన్సర్లతో కలిసి నచ్చినట్టుగా స్టెప్పులు కూడా వేయొచ్చు. అయితే బార్ డ్యాన్సర్లపై నోట్లు విసిరడం మాత్రం నిషేధం. వినడానికి ఆశ్ఛర్యంగా ఉన్నా... దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా వెలువరించిన తీర్పు సారాంశం ఇదే. నిజానికి దేశవ్యాప్తంగా బార్‌లో డ్యాన్సులు చేయడంపై నిషేధం ఉంది. అందులోనూ బార్ డ్యాన్సర్లతో చిందులేయించడం కఠిన నేరంగా పరిగణిస్తారు. అయితే వాణిజ్య రాజధాని ముంబైలో మాత్రం బార్ డ్యాన్సులకు అనుమతి ఉంది. రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉన్నట్టుగానే... బార్‌లలో డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించేందుకు అనుమతి ఉంది. అయితే డ్యాన్సింగ్ బార్‌లకు కొన్ని కఠిన నియమాలు పెడుతూ 2016 తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.
ఆ తీర్పు ప్రకారం డ్యాన్సింగ్ బార్లలో మందు కొట్టడం గానీ, డిస్కోలు ఏర్పాటు చేయడం గానీ నిషేధం. అంతేకాకుండా ప్రతీ డ్యాన్సింగ్ బార్‌లో కచ్ఛితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని షరతు విధించింది. అయితే వీటన్నింటినీ కొట్టేస్తూ తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర డ్యాన్స్ బార్స్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంవాటిల్లుతుందని అభిప్రాయపడిన సుప్రీం... ఆ నిబంధనను ఎత్తేసింది. అంతేకాకుండా కస్టమర్లు కూడా యథేచ్ఛగా డ్యాన్సులు చేసుకోవచ్చని, కావాలంటే డిస్కోలు, ఆర్కెస్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని బార్ల యజమానులకు వరాలు ప్రసాదించింది. అయితే బార్ డ్యాన్సర్లపై నోట్ల కట్టలు విసరడాన్ని మాత్రం నిషేధించింది సుప్రీం. ఇది స్త్రీలను అవమానించడమేనని భావించిన సుప్రీం... డ్యాన్సర్లకు వచ్చే టిప్స్‌కు కత్తెర వేసింది.
అలాగే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు, విద్యాలయాలకు కనీసం 1 కి.మీ. దూరంలో బార్లు ఏర్పాటు చేయాలని... బార్ రూమ్‌కీ, డ్యాన్స్ ఫోర్ల్ వేర్వేరుగా ఉండాలని తెలిపింది. డ్యాన్స్ బార్లకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 మధ్యలోనే నడిపాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
ఇవి కూడా చదవండి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Supreme Court