దేశంలో మహిళలపై అత్యాచారాలు, నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, బాలికలపై ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితుల్లో ఎక్కువగా వారికి సమీప బంధువులు, తెలిసివారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ మైనర్ బాలికను ఆమె బంధువు బలవంతంగా వ్యభిచార కుపంలోకి నెట్టింది. వివరాలు.. బిహార్‌కు చెందిన బాలికను ఆమె బంధువు గుల్షాన్ బానో అనే మహిళ ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లింది. అక్కడి బల్లియా జిల్లాకు తీసుకెళ్లి వ్యభిచారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసింది. ఈ విషయం తెలుసుకున్న మైనర్ బాలిక తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై మైనర్ బాలిక కుటుంబ సభ్యులు శిశు సంక్షేమ కమిటీ (CWC) అధికారులకు ఫిర్యాదు చేశారు.
అలాగే ఆ మహిళ ఉన్నచోటు గురించి కూడా ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో సీడబ్యూసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సిటీ మేజిస్ట్రేట్, బల్లియా పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల నేతృత్వంలో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిందితురాలు ఉన్న ఇంటిపై జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఇంట్లో ఉన్న బాలికను రక్షించారు.
బాలికను ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లిన గుల్షాన్ బానోను అరెస్ట్ చేశారు. అనంతరం సీడబ్ల్యూసీ అధికారుల ముందు మైనర్ బాలికను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించారు. నిందితురాలు బానోపై ఐపీసీ 366A, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Published by:Sumanth Kanukula
First published:December 25, 2020, 10:19 IST