కెనడాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ఆత్మహత్యకు అసలు కారణాలేంటన్నది బయటపడుతున్నాయి. ఆర్థిక కష్టాలు లేకున్నా, లైఫ్ లో సెటిల్ అయినా అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది అందరికీ అనుమానాస్పదంగా మారింది. అయితే ఇటీవల కుటుంబంలో జరిగిన ఓ ఘటనే అతడి ఆత్మహత్యకు అసలు కారణమని తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో సొంతూరికి వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేసుకుని మరీ ఈ దారుణానికి పాల్పడటం శోచనీయం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన నారాయణరావు, హైమావతి దంపతుల 27 ఏళ్ల కుమారుడు ప్రవీణ్ రావు కెనడాలో ఉంటున్నాడు. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
2015లోనే కెనడాకు వెళ్లిన అతడు క్రమక్రమంగా ఎదిగాడు. విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడ ఓ పెట్రోల్ బంకును కూడా లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవలే అతడికి కెనడా పౌరసత్వం కూడా లభించింది. ఆర్థికంగా కూడా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. గురువారం సొంతూరికి వస్తానని తల్లిదండ్రులకు అంతకుముందే చెప్పాడు. తమ కుమారుడు చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడని తెలిసి తల్లిదండ్రులు కూడా సంబరపడ్డారు. కానీ ఇంతలోనే ’మీ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు ఉంటున్న బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలను కాపాడలేకపోయాం‘ అని అతడి స్నేహితులు ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఈ విషయం తెలిసి వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!
కాగా, ప్రవీణ్ రావు ఆత్మహత్యకు కుటుంబంలో ఇటీవల జరిగిన ఓ ఘటనే అసలు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనతోనే అతడు మనస్తాపానికి గురయ్యాడు. తనతోపాటు విద్యాభ్యాసం చేసిన ఓ యువతిని ప్రవీణ్ రావు ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. అయితే తల్లిదండ్రులు మాత్రం అతడి ప్రపోజల్ ను తిరస్కరించారని సమాచారం. ఈ ఘటన వల్ల ప్రవీణ్ రావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సొంతూరికి వస్తానని చెప్పి మరీ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతదేహం ఏప్రిల్ నాలుగో తారీఖున స్వస్థలానికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కెనడాలో ఆత్మహత్య కేసు సంబంధిత అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకు వస్తారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.