Andhra Pradesh: బంగారు భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టమన్నారు.. బెజవాడలో బోర్డు తిప్పేశారు..

బోర్డు తిప్పేసిన రియల్ వెంచర్స్

మా సంస్థలో పెట్టుబడి పెట్టండి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి అంటూ కస్టమర్లను ఆకర్షించారు. విజయవాడ చుట్టుపక్కల భూములు.. అతి తక్కువ ధరకే అంటూ ఆఫర్ల వర్షం కురిపించారు.. అందరినీ నమ్మించి ఆరు కోట్లు వసూలు చేశారు. చివరికి బోర్డు తిప్పేశారు.

 • Share this:
  ఆకలితో పస్తులు ఉన్నా.. తిన్న తినకపోయినా.. పండుగులు వేడుకలు జరుపుకోకపోయినా.. భవిష్యత్తు కోసం నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి అనుకుంటారు మధ్య తరగతి ప్రజలు.. అలాంటి వారి ఆశలను.. క్యాష్ చేసుకుంటోంది రియల్ మాఫియా.. భూమిపై పెట్టుబడి పెట్టండి.. భవిష్యత్తును బంగారంగా మార్చుకొండి అని ప్రకటనలు ఇస్తున్నాయి. కాస్త స్థలం కొంటే రేపొద్దున్న పిల్లలకు ఉపయోగ పడుతోందనే ఆశతో అంతా చెమటోడ్చి.. కూడబెట్టిన డబ్బుతో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ కొందరు రియల్ మాఫియా చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా బెజవాడలో ఓ రియల్ వెంచర్ సంస్థ బోర్డు తిప్పేసింది. బెజవాడకు చెందిన నిర్మాణ రంగ సంస్థ ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ బోర్డు తిప్పేసింది. కొనుగోలుదారుల నుంచి దాదాపు 6కోట్ల రూపాయల వరకు అడ్వాన్సులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించింది సంస్థ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు గతేడాది ఆగస్టులో విజయవాడ కేంద్రంగా ఎంకే కనస్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. గురునానక్‌ కాలనీలోని మహానాడులో కార్యాలయాన్ని తెరిచారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోనూ ఒక బ్రాంచిని ఏర్పాటు చేశారు.

  ఈ సంస్థకు విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామానికి చెందిన ఉప్పు మనోజ్‌కుమార్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. యద్దనపూడికి చెందిన బలగం రవితేజ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థ అభివృద్ధి చేసే స్థలాలు, నిర్మించే గేటెడ్‌ కమ్యూనిటీల్లో విల్లాలు విక్రయించడానికి విజయవాడలోని మొత్తం 20 మంది యువకులను ఏజెంట్లుగా నియమించుకున్నారు. విక్రయించిన ప్లాట్లలో వారికి రెండు శాతం కమీషన్‌ ఇస్తామని నమ్మించారు. పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్‌, రవితేజ, కలిసి ఈ ఏజెంట్లకు విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం, ముస్తాబాద్‌, ఆగిరిపల్లిలో ఉన్న స్థలాలను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు వెంచర్లను ఏజెంట్లకు చూపించారు. ఈ స్థలాలను చూసిన ఏజెంట్లు బుకింగ్స్‌ తీసుకొచ్చారు. కొంత మంది ఏజెంట్లు ముందుగా పెట్టుబడి పెట్టి అడ్వాన్సులు ఇచ్చారు. భారీగా ఆఫర్లు ప్రకటించడంతో పలువురు కస్టమర్లు అడ్వాన్సులు చెల్లించారు. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖపట్నానికి చెందిన సుమారు 100 మంది లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చారు.

  ఏజెంట్ల ద్వారా బుకింగ్స్‌ చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్ల కోసం పట్టుబట్టారు. శ్రీనివాసరావు, మనోజ్‌, రవితేజపై ఏజెంట్లు ఒత్తిడి తెచ్చారు. దీంతో మార్చి నుంచి సంస్థ నిర్వాహకులు కార్యాలయానికి రాకపోకలు తగ్గించారు. ముగ్గురూ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: