news18-telugu
Updated: October 5, 2020, 5:41 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో అత్యాచారాల పర్వంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మహిళల భద్రతపై మరోసారి చర్చ జరుగుతోంది. హాథ్రస్ నిందితులకు ఉరిశిక్ష వేయడంతో పాటు సీఎం పదవి నుంచి యోగి తప్పుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్యే.. ఖమ్మంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడని.. ప్రతిఘటించినందుకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడన్న వార్త దుమారం రేపుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక.. ఖమ్మంలోని ముస్తాఫా నగర్లో ఓ సంపన్న కుటుంబంలో పని మనిషిగా పనిచేస్తోంది. ఐతే 13 ఏళ్ల ఆ మైనర్ బాలికపై ఇంటి యజమాని కుమారుడు కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను అత్యాచారం చేయబోయాడు. బాలిక ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మంటల్లో కాలుతూనే బాలిక బయటకు పరుగులు పెట్టింది. తనను కాపాడాలని కేకలు వేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ దురాగతానికి పాల్పడిన నిందితుడి కుటుంబ సభ్యులు.. బాలికను తీవ్రంగా భయపెట్టినట్లు సమాచారం. విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు తల్లిదండ్రులను కూడా చంపుతానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది. విషయం పొక్కకుండా ఉండేందుకు.. ప్రైవేటు సెటిల్మెంట్కు, కుల పంచాయితీకి ఆ సంపన్న కుటుంబం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఐతే రాజీ కుదరకపోవడంతో విషయం బయటకు వచ్చింది. తమను చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని.. న్యాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 5, 2020, 5:36 PM IST