దళిత కుటుంబంపై మూక దాడి.. గర్భిణీ అని కూడా చూడకుండా.. వీడియో..

(Image-Twitter)

భూ వివాదం కారణంగా ఓ దళిత కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు.

 • Share this:
  ఓ దళిత కుటుంబంపై గ్రామంలోని ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు గాయపడ్డారు. అందులో ఓ గర్భిణీ కూడా ఉంది. ఈ ఘటన రాజస్తాన్‌లోని పాలీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. మార్చి 15న దళిత వ్యక్తి అశోక్ కుమార్ మేఘవాల్ తన కుటుంబానికి హాని ఉందని రోహెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇందుకు ఓ భూవివాదం కారణమని పేర్కొన్నాడు. తన ఫిర్యాదులో ఠాకూర్ హుకుమ్‌ సింగ్ రాజ్‌పుత్‌తో పాటు మరో ఆరుగురి పేర్లను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మూడు రోజుల తర్వాత నిందితులు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అతని తల్లి, గర్భిణీగా ఉన్న సోదరిపై దాడి చేశారు.

  ఈ ఘటనపై బాధితుడు అశోక్ కుమార్ మేఘవాల్ మాట్లాడుతూ.. "పోలీసులు సమయానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శుక్రవారం 10 నుంచి 12 మంది వ్యక్తులు మళ్లీ మాపై దాడి చేశారు. నా తల్లి, సోదరిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి రాజస్తాన్ ముఖ్యమంత్రి, డీజీపీ, స్థానిక అధికారులకు లేఖలు రాశానని.. కానీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని తెలిపారు.

  అయితే ఓ భూమి యజమాన్య హక్కుల కోసం ఆ దళిత కుటుంబం 2019 నుంచి రెండు కేసులపై కోర్టులో పోరాడుతుంది. దీనిపై అశోక్ స్పందిస్తూ.."మేము ఈ భూమిపై తరతరాలుగా నివసిస్తున్నాం. కానీ ఆ స్థలాన్ని ఖాళీ చేయమని హుకుమ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారు. అలాగే డబ్బు కూడా డిమాండ్ చేస్తున్నాడు"అని ఆరోపించాడు. ఇక, అశోక్ కుమార్ మేఘవాల్ కుటుంబంపై దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో మహిళలు సాయం కోసం కేకలు వేస్తు కనిపించారు.

  మరోవైపు మేఘవాల్ కుటుంబానికి వ్యతిరేకంగా అవతలి వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఘవాల్ కుటుంబం దొంగతనం, ఇతర నేరాలకు పాల్పడినట్టు తెలిపారు. ఇక, మేఘవాల్ ఫిర్యాదు ఆధారంగా నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో, సంబంధిత ఐపీసీ సెక్షన్ల కేసు నమోదు చేసినట్టు పాలీ ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్న మిగతా నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపారు. మేఘవాల్ కుటుంబానికి భద్రత కల్పించామని వెల్లడించారు.
  Published by:Sumanth Kanukula
  First published: