ఆత్మహత్య కేసుల్లోనే అత్యంత అరుదైనదిగా పోలీసులు భావిస్తోన్న ఘటన రాజస్థాన్ లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఐదుగురు కూతుళ్లతో కలిసి బావిలోకింది. గ్రామస్తులు గుర్తించేలోపే ఆరుగురూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూతుళ్లు అనూహ్యంగా చావు కాటు నుంచి తప్పించుకోగలిగారు. భర్తతో గొడవల కారణంగానే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కోటా జిల్లాలో చెచాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కాలియాఖేడీ గ్రామాన్ని ఆనుకుని ఉండే బంజారోంకా డేరాలో ఈ ఘోర సంఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా లభించిన సమాచారాన్ని చెచాట్ పోలీసులు మీడియాకు వివరించారు..
కాలియాఖేడీ గ్రామాన్ని ఆనుకుని ఉండే బంజారా డేరాలో శివపాల్ బంజారా కుంటుబం నివసిస్తోంది. రగ్గులు, దుప్పట్లు అమ్ముకుంటూ జీవనం సాగించే శివలాల్ కు భార్య బాదామి దేవి ఏడుగురు కూతుళ్లు ఉన్నారు. బాదామి దేవి వయసు ప్రస్తుతం 40 ఏళ్లు అయినా గతేడాది కూడా ఓ పాపకు జన్మనిచ్చింది. అక్షరాస్యతకు దూరంగా ఉండే రాజస్థాన్ పల్లెల్లో, బంజారా డేరాల్లో కొడుకు కావాలనే కోరికతో దంపతులు ఇలా గంపెడు పిల్లల్ని కనడం తరచూ చూసేదేనని స్థానికులు చెబుతున్నారు. దుప్పట్ల వ్యాపారంలో వచ్చిన డబ్బుతో అంతమంది పిల్లల్ని సాకడం ఇబ్బందికరంగా ఉడేదేమో, భార్యాభర్తలు నిత్యం గొడవలు పడేవాళ్లు. చిటికీ మాటికీ భర్త గొడవకు దిగుతున్నాడని మనస్తాపం చెందిన బాదామిదేవి అనూహ్య చర్యకు సిద్ధమైంది.
పక్క గ్రామంలో దగ్గరి బంధువుల ఇంట్లో పెదకర్మ కార్యక్రమం కోసమని శివలాల్ నిన్న శనివారం ఇంటి నుంచి వెళ్లాడు. అతును ఊరెళ్లే ముందు కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. శనివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత పిల్లలందరూ భోజనం చేశారు. కొన్ని గంటల తర్వాత ఏదో పూనకం వచ్చినట్లు బాదామిదేవి తన ఐదుగురు పిల్లల్ని బయటికి నడిపించింది. ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న పెద్ద వ్యవసాయ బావి దగ్గరికి తీసుకెళ్లి పిల్లల్ని తోసేసి, తానూ దూకేసింది. బలవన్మరణానికి పాల్పడాలనే తలంపు వచ్చే సమయానికే పెద్ద పాప గాయత్రి(15), నాలుగో పాప పూనమ్(7) నిద్రపోవడంతో వాళ్లిద్దరినీ ఇంట్లోనే వదిలేసి, అప్పటికింకా నిద్రపోని ఐదుగురు కూతుళ్లను బావి దగ్గరికి తీసుకెళ్లింది.
ఆదివారం తెల్లవారే సరికి అమ్మా, చెల్లెళ్లు కనిపించకపోవడంతో గాయత్రి చుట్టుపక్కలవాళ్లను నిద్రలేపింది. అందరూ కలిసి గాలించగా, వ్యవసాయ బావిలో ఆరుగురూ తేలుతూ కనిపించారు. పోలీసులకు సమాచారం అందించి, వాళ్లు వచ్చేలోపే గ్రామంలోని యువకులు తాళ్లతో వారిని బయటికి తీశారు. బావిలో పడిన బాదామిదేవి(40), రెండో కూతురు సావిత్రి (14), మూడో కూతురు కాజల్(8), ఐదో కూతురు గుంజన్(4), ఏడాదిన్నర వయసున్న చిన్న కూతురు అర్చన ప్రాణాలు కోల్పోయారు. ఈలోపే విషయం తెలుసుకున్న శివలాల్ పక్కూరి నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. ప్రాణాలతో మిగిలున్న ఇద్దరు పాపలు, తమ తల్లీ, అక్కాచెల్లెళ్ల శవాలను చూస్తూ బోరున ఏడ్చిన దృశ్యం అందరికీ కంటతడి పెట్టించింది. భార్యతో గొడలు సహజమే కానీ ఆమె ఇలాంటి పని చేస్తుందని ఊహించలేకపోయానని శివలాల్ అంటున్నాడు. ఒకే ఇంట్లో తల్లి, ఐదుగురు ఆడపిల్లలు చనిపోవడంతో ఊరంతా విషాదం అలముుకుంది. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minor girl, Rajasthan, Women suicide