అత్యున్నత న్యాయస్థానాలు నేరస్తులు చేసిన కొన్ని కేసుల విషయంలో మానవీయ కోణంలో కూడా ఆలోచించి తీర్పులు వెల్లడిస్తాయి. ఈవిషయంలో రాజస్థాన్ హైకోర్టు( Rajasthan high court)తీసుకున్న నిర్ణయం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ అత్యాచారం కేసులో 20ఏళ్లు జైలు శిక్ష (20 years imprisonment)అనుభవించాల్సిన ఖైదీకి పెరోల్ బెయిల్(Parole bail) మంజూరు చేసింది. న్యాయస్థానం ఒక దోషి విషయంలో ఇంత దయార్ధ హృదయం ఎందుకు చూపించిందంటే నేరస్తుడి భార్య తనకు సంతానం కలగాలని అందుకోసం తన భర్తకు బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో రాజస్థాన్ హైకోర్టు నిందితుడికి 15రోజుల పెరోల్ బెయిల్ మంజూరు చేసింది. అందుకోసం ఎలాంటి కండీషన్స్ పెట్టిందో తెలుసా.
భార్యను తల్లిని చేసేందుకు ఖైదీకి బెయిల్..
నేరస్తులు ఎంతటి వాళ్లైనా చట్టానికి చుట్టాలు కాదు. అందుకే తీర్పు వెల్లడించే న్యాయస్థానాలు హత్యలు, అత్యాచార కేసుల విషయంలో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. రాజస్థాన్‌లో రాహుల్ అనే పాతికేళ్ల యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి అటుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనేరంలో అతనిపై పోక్సో చట్టం నమోదు చేసి ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే నిందితుడు జైలు పాలు కావడంతో ఆతని భార్య భర్త దూరై..సంతానం లేక ఒంటరిగా ఉంటున్నానని తాను తల్లిని కావాలంటూ ...తనకు పిల్లలు కలిగించేందుకు భర్త రాహుల్‌కి పెరోల్ బెయిల్ మంజూరు చేయాలని రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అత్యాచార నిందితుడికి ఊరట..
వంశ పరిరక్షణ కోసం ఖైదీ భార్య వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీకి షరతులు విధిస్తూ 15రోజుల పాటు పెరోల్ బెయిల్ మంజూరు చేసింది. అంతే కాదు 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించాలన్న కోర్టు ఆదేశించింది.
రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం..
కోర్టు తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి సంబంధించిన కేసును విచారించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ కోరికను మానవత ధృక్పధంతో ఆలోచించింది. నేరస్తుడి భార్య పిల్లలు కావాలని కోరుకుంటోందని, భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆమె పిటిషన్ దాఖలు చేసిందని ఆ దరఖాస్తును తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్టే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. అందులో భాగంగానే పెరోల్ బెయిల్ మంజూరు చేసేందుకు అంగీకరించిందని వివరణ ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minor girl raped, Rajasthan, Trending news