హోమ్ /వార్తలు /క్రైమ్ /

Bank Cheat: పనిచేసే బ్యాంకుకే కన్నం.. నకిలీ బంగారంతో రూ. 3 కోట్ల లోన్లు!

Bank Cheat: పనిచేసే బ్యాంకుకే కన్నం.. నకిలీ బంగారంతో రూ. 3 కోట్ల లోన్లు!

పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

Gold Loan: బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పని చేస్తున్న వ్యక్తి అదే బ్యాంకును బురిడీ కొట్టించి రూ. 3 కోట్ల మేర కొట్టేశాడు. తన స్నేహితులతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరిపించి వారితో నకిలీ బంగారం తాకట్టు పెట్టించి డబ్బులు తీసుకునేవాడు. అతడితో పాటు సహకరించిన నలుగురిని రాచకొండపోలీసులు అరెస్టు చేశారు.

ఇంకా చదవండి ...

  బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పని చేస్తున్న వ్యక్తి అదే బ్యాంకును బురిడీ కొట్టించి రూ. 3 కోట్ల మేర కొట్టేశాడు. బ్యాంకుకు తాకట్టు కోసం తీసుకువచ్చిన బంగారం నకిలీదా, కాదా అని పరీక్షించి దానికి విలువ కట్టడం గోల్డ్ అప్రైజర్ డ్యూటీ. దీన్ని అతను ఆసరాగా మర్చుకున్నాడు. తన మిత్రులతో దాదాపు 121 బ్యాంకు ఖాతాలు తెరిపించి, వారితో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టించేవాడు. బంగారాన్ని తనిఖీ చేసేది తనే కాబట్టి సరైనదే అంటూ అధికారులను నమ్మించేవాడు. గుర్తుపట్టి నిలదీసిన అధికారులకు తన అక్రమ సంపాధనలో వాటా ఇచ్చి లొంగదీసుకునేవాడు. ఎట్టకేలకు అతని బండారం బయటపడింది. రాచకొండ పోలీసులు ఆ నిందితుడిని, అతడికి సహకరించిన బ్యాంకు అధికారులను అరెస్టు చేశారు.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లోజ్‌ సాయి అలియాస్‌ సాయినాథ్‌ తుక్కుగూడలోని యూనియన్‌ బ్యాంకులో గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్రమంగా డబ్బులు సంపాధించాలన్న ఆలోచన అతడికి రావడంతో నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం పొందే పథకం పన్నాడు. బంధువులు, స్నేహితులతో పదుల సంఖ్యలో ఖాతాలు తెరిపించేవాడు. వారితో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టించేవాడు. మేనేజర్‌కు అనుమానం రాకుండా నకిలీ బంగారాన్ని ఒరిజినల్ దని నమ్మించి రుణాలు ఇప్పించేవాడు. ఆ ఖాతాలు స్నేహితులు, బంధువులవే అయినా బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులన్నీ అతడే తీసుకునేవాడు. అయితే ఆడిటింగ్‌లో తన మోసం బయటపడకుండా మరో ప్లాన్ వేశాడు. ఇతర బ్యాంకుల్లో అప్రైజర్స్‌గా పనిచేస్తున్న మిత్రులైన సంతోష్‌, శివనాథ్‌లతోనే ఆడిటింగ్‌ చేయించేవాడు. ఇలా కొంత కాలం ఎలాంటి ఇబ్బంది లేకుండానే అతని వ్యవహారం సాగింది.

  కొన్నాళ్ల తర్వాత బ్యాంకు మేనేజర్‌ అనిల్‌ కుమార్‌కు అనుమానం రావడంతో అతడిని ప్రశ్నించాడు. దీంతో సాయికుమార్‌ మేనేజర్‌కు ప్రలోభాలు చూపి తనకు సహకరించేలా చేశాడు. అనంతరం ఇద్దరు కలిసి నకిలీ బంగారు రుణాల దందా కొనసాగించారు. ఇక సాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరయ్యేది. మంజూరైన రుణాన్ని ఇద్దరు పంచుకునేవారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత అనిల్‌కుమార్‌ అక్కడి నుంచి బదిలీపై నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత బదిలీపై వచ్చిన డిప్యూటీ మేనేజర్‌ రామావత్‌ ప్రదీప్‌ కుమార్‌ను సాయి తన దందాలో భాగస్వామిగా మార్చుకున్నాడు.

  కొన్ని రోజులకు ప్రదీప్ కుమార్‌ కూడా వెళ్లిపోయాడు. అనంతరం మేనేజర్‌గా వచ్చిన యశ్వంత్‌రెడ్డి సాయి దందాలను గుర్తించారు. ప్రలోభాలకు లొంగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాయినాథ్‌ను విచారించగా ఇన్నాళ్లు అతను చేసిన మోసాలు బయటపడ్డాయి. దీంతో అతడితో పాటు అతనికి సహరించిన బ్యాంకు అధికారులు అనీల్‌కుమార్‌, ప్రదీప్, ఆడిటర్లు సంతోష్‌, శివనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల నుంచి కారు, ద్విచక్రవాహనంతోపాటు స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సాయినాథ్‌ అతని స్నేహితులకు చెందిన 96 ఖాతాలను పోలీసులు సీజ్‌ చేశారు.

  రుణాలు వేలం వేసే పరిస్థితి రాకుండా వాటిని నిందితుడు సకాలంలో రెన్యువల్‌ చేస్తూ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు సాయి తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో సైతం గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గర్తించారు. అక్కడ కూడా ఈ విధంగానే రూ.54.06 లక్షల రుణం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్రమంగా రుణాలు పొందడంతో వచ్చిన డబ్బులతో సాయి గోవాలో జల్సాలు చేసేవాడని పోలీసులు గుర్తించారు. రూ. 60 లక్షలతో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడని తేలింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Crime, Gold loans, Rachakonda Police

  ఉత్తమ కథలు