పెళ్లైన కాసేపటికే వధువు మెడలో తాళిబొట్టు మాయం.. పెళ్లి వీడియో చూసి అందరూ షాక్

ప్రతీకాత్మక చిత్రం

పురోహితుడి కోసం వధూవరుల బంధువులు రెండు రోజులుగా అతడి ఫోన్‌కు కాల్ చేస్తున్నారు. కానీ స్విచాఫ్ వస్తుంది. ఇంటికెళ్లి అడిగితే తనకేమీ తెలియదని ఆయన భార్య చెప్పింది. ఏం చేయాలో అర్ధం గాక.. పెళ్లింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Share this:
    పెళ్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగిన కాసేపటికే వధువు మెడలో తాళి బొట్టు మాయమైంది. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత.. భోజనాలు ముగిసిన తర్వాత.. ఆ వధువుకు మంగళసూత్రం కనిపించలేదు. ఈ విషయం తెలిసి అందరూ కంగారుపడిపోయారు. ఇప్పుడే వరుడు కట్టాడుగా.. అప్పుడే ఎక్కడికి పోయిందని వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరకు పెళ్లి వీడియో చూడగా.. దొంగ దొరికిపోయాడు. ఆ వీడియో చూసి వధూవరుతో పాటు బంధువులంతా షాక్ తిన్నారు. ఎందుకంటే.. మంగళసూత్రాన్ని కొట్టేసింది ఎవరో కాదు.. మంత్రాలు చదివిన పురోహితుడే. ఈ ఆశ్చకరమైన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

    మెదక్ జిల్లా తుప్రాన్‌కు చెందిన పడాలపల్లికి చెందిన జ్ఞానేందర్ దాస్, నర్సాపురం మండలం గొల్లపల్లికి చెందిన వసంత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 16న తుప్రాన్‌లో పెళ్లి వేడుక జరిగింది. గజ్వేల్‌కు చెందిన ఓ పురోహితుడు వీరి పెళ్లి తంతును నిర్వహించారు. ఐతే వధువు మెడలో వరుడు కట్టిన తాళి కాసేపటికే కనిపించలేదు. అప్పటికే పెళ్లి తంతు పూర్తయింది. ఆ బంగారం మంగళసూత్రం 3 తులాల వరకు ఉంటుంది. ఎక్కడైనా పడిపోయిందా? లేదంటే ఎవరైనా కొట్టేశారో అర్ధం కాలేదు. ఐతే వివాహా తంతును వీడియో రికార్డు చేస్తారు కదా. ఆ వీడియో చూస్తే అసలు విషయం తెలిసింది. పంతులే తాళి బొట్టును కొట్టేసినట్లు తేలింది. మంగళసూత్రాన్ని తన జేబులో వేసుకుంటున్నట్లుగా అందులో రికార్డయింది.

    ఆ పురోహితుడి కోసం వధూవరుల బంధువులు రెండు రోజులుగా అతడి ఫోన్‌కు కాల్ చేస్తున్నారు. కానీ స్విచాఫ్ వస్తుంది. ఇంటికెళ్లి అడిగితే తనకేమీ తెలియదని ఆయన భార్య చెప్పింది. ఏం చేయాలో అర్ధం గాక.. పెళ్లింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పురోహితుడు తాళి బొట్టును జేబులో వేసుకుంటున్న వీడియోను పరిశీలించారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహాంర ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలిసింది. పురోహితుడే తాళి బొట్టును కొట్టేయడమేంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: