పంజాబ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లల్ని స్కూల్ నుంచి ఇళ్లకు దింపేందుకు వెళ్తున్న స్కూల్ వ్యాన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరికొందర్ని స్థానికులు కాపాడారు. వారికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన చిన్నారులంతా ఐదేళ్లలోపు వారు కావడంతో... వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారకరమైన ఘటన సాంగ్రూర్లో సిద్ సమధన్ రోడ్డులో చోటు చేసుకుంది. సిమ్రన్ పబ్లిక్ స్కూల్కు చెందిన ఓ ప్రైవేట్ వ్యాన్ 12మంది చిన్నారుల్ని స్కూల్ అయిపోవడంతో ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు తీసుకెళ్తుంది. ఇంతలో రోడ్డుపైనే వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడ సమీపంలో పొలాల్లో పనిచేస్తున్న వారు ఇది గమనించి వెంటనే వ్యాన్ దగ్గరకు పరుగులు తీశారు. పలువురు చిన్నారుల్ని బయటకు తీశారు. అయితే అప్పటికే నలుగురు పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెఫ్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాద ఘటనపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించామన్నారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Punjab