హైదరాబాద్ విద్యార్థి ప్రాణం తీసిన పబ్‌జీ... చదువుకొమ్మని తల్లి తిట్టిందని...

చదువుకోకుండా పబ్‌జీ గేమ్ ఆడుతున్న కొడుకును తిట్టిన తల్లి... మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థి... హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 3, 2019, 6:56 PM IST
హైదరాబాద్ విద్యార్థి ప్రాణం తీసిన పబ్‌జీ... చదువుకొమ్మని తల్లి తిట్టిందని...
మరో ప్రాణం తీసిన పబ్‌జీ... తల్లి తిట్టిందని పదో క్లాస్ విద్యార్థి ఆత్మహత్య...
  • Share this:
‘పబ్‌జీ’ వంటి ఆన్‌లైన్ గేమ్స్‌ అతిగా ఆడడం వల్ల పిల్లల మానసిక, శారీరక స్థితిపై దుష్ప్రభావం పడుతుందని నిర్ధారించింది వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్ (ప్రపంచ ఆరోగ్యసంస్థ- WHO). పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ‘పబ్‌జీ’ గేమ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ మహానగరంలో ‘పబ్‌జీ’ గేమ్ భూతం మరో ప్రాణం బలితీసుకుంది. ఎప్పుడూ పబ్‌జీ ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఆవేదనతో ఓ తల్లి, పదోక్లాస్ చదువుతున్న తన కొడుకును తిట్టింది. తల్లి కోప్పడడంతో మనస్థాపం చెందిన ఆ కొడుకు... ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా పబ్‌జీ గేమ్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన వెలుగుచూడడం అందర్నీ కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలో మల్కాజిగిరి ఏరియాలోని విష్ణుపురి ఎక్స్‌టెన్సన్ కాలనీకి చెందిన భరత్‌రాజ్, ఉమాదేవి దంపతులకు లహరి అనే కూతురు, సాంబశివ అనే కొడుకు ఉన్నారు. 16 ఏళ్ల సాంబశివ... స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో క్లాస్ చదువుతున్నాడు. పదో క్లాస్ పరీక్షల్లో భాగంగా మార్చి3న చివరి పరీక్ష రాయాల్సి ఉంది. అయితే పబ్‌జీ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిన సాంబశివ... పరీక్షల సమయంలో కూడా ఫోన్‌లో గేమ్ ఆడుతూ గడిపేసేవాడు. దీన్ని గమనించిన అతని తల్లిదండ్రుల్లో పదో తరగతి బోర్డు పరీక్షల్లో కొడుకు ఫెయిల్ అవుతాడేమోననే ఆవేదన పెరిగిపోయింది.

రేపు ఎగ్జామ్ అనగా సోమవారం రాత్రి కూడా సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతూ కనిపించాడు సాంబశివ. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన అతని తల్లి... కొడుకును మందలించింది. వెళ్లి చదువుకొమ్మని చెప్పి, కొడుకు సెల్‌ఫోన్ లాక్కుంది. తల్లి తిట్టడంతో తీవ్రంగా మనస్థాపం చెందిన సాంబశివ... తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కోపంతో కొడుకు అలా చేశాడని తల్లి తన పనుల్లో బిజీ అయిపోయింది. అరగంట తర్వాత కొడుకు చదువుతున్నాడా? ఏం చేస్తున్నాడోననే అనుమానంతో తలుపు తట్టింది ఉమాదేవి. ఎంతసేపటికీ అతను తలుపు తీయలేదు. కంగారుగా కిటికిలో నుంచి చూడగా సాంబశివ ఉరి వేసుకుని కనిపించాడు. టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు సాంబశివ. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచి, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాంబశివ ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు వైద్యులు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: April 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>