కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళన హింసాత్మకంగా మారింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడంపై చేపట్టిన నిరసన ర్యాలీ ఒక్కసారిగా అదుపు తప్పింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ఆయన ఇల్లు మంటల్లో చిక్కుకుంది. ఆయన కుటుంబసభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. కోససీమ(Konaseema) జిల్లా పేరును అంబేద్కర్ (Ambedkar) జిల్లాగా మార్చడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పేరు మార్చవద్దని, కోనసీమ జిల్లాగానే ఉంచాలని ఓ వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని(Amalapuram) గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లానే ముద్దు, వేరే పేరు వద్దు అంటూ నినాదాలు చేశారు.
ఆందోళన నేపథ్యంలో పోలీసులు కూడా భారీగానే మోహరించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకుని కలెక్టరేట్ వద్దకు పరుగులు తీశారు. వీరిని పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు.
ఈ దాడిలో పోలీసులకు,యువకులకు ఇరువర్గాలకు గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్కు గాయాలయ్యాయి. రెచ్చిపోయిన ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్(Minister Viswaroop) ఇంటికి నిప్పు పెట్టారు. క్యాంప్ కార్యాలయంపై కూడా దాడి చేశారు. తన ఇంటిపై దాడి చేయడం దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ అన్నారు. టీడీపీ, జనసేనబీజేపీ కోరితేనే కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చామని అన్నారు. ఆ తరువాత ఈ పార్టీలు మాట మార్చాయని ఆరోపించారు. పలు ప్రభుత్వం, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తంగా ఉంది.
మరోవైపు ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. కొన్ని శక్తులు వెనకుండి ఈ హింసాత్మక ఘటనలను ప్రొత్సహించినట్టు కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని పార్టీలను సంప్రదించిన తరువాత పేరు మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. కోనసీమలో శాంతి నెలకొనేలా అన్ని పార్టీలు ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.