PRIEST ATTACKS DEVOTEES IN SECUNDERABAD GANESH TEMPLE POLICE CASE FILED AGAINST PRABHAKARA SHARMA MKS
Secunderabad: ప్రఖ్యాత గణేశ్ టెంపుల్లో రౌడీ పూజారి.. భక్తుడిపై అర్చకుడి భయానక దాడి..
భక్తుడిపై పూజారి దాడి దృశ్యాలు
సికింద్రాబాద్ లోని ప్రఖ్యాత గణేశ్ ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ గుడికి వచ్చిన భక్తుడిపై భయానకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో అర్చకుడిపై పోలీస్ కేసు నమోదైంది. అయ్యగారి రౌడీ వ్యవహారాలపై ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులు వెళ్లాయి..
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దాన్ని ఆనుకుని ఉండే గణేశ్ టెంపుల్ చరిత్ర కూడా చిన్నదేమీ కాదు. క్రీస్తుశకం 1874లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయడానికి అరదశాబ్దం ముందే, అంటే, 1824లో గుర్తింపుపొందింది గణేశ్ టెంపుల్. జంటనగరాల్లో హిందూ ఆలయం, ముస్లింల మసీదు ఒకే గోడను పంచుకునే చోటుకూడా దాదాపు ఇదొక్కటే అంటారు. రైల్వే స్టేషన్ కు 24X7 ప్రయాణికుల రద్దీ అటుంచితే, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ కు స్థానిక భక్తుల తాకిడి కూడా ఎక్కువే. సికింద్రాబాద్ గుండా నిత్యం ప్రయాణాలు చేసేవారు చాలా మంది గణేశ్ టెంపుల్ ను తప్పక దర్శించుకుంటారు. అయితే అంతటి ప్రశస్తమైన చోట రౌడీ పూజారి వ్యవహారం కలకలం రేపింది. అయ్యవారు ఓ భక్తుణ్ని ఆలయంలోనే చితకబాదిన వైనం వైరలైంది.
సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ మీదుగా రోజువారీ ప్రయాణాలు చేసేవాళ్లలో చాలా మంది నిత్యం ఆలయ దర్శనానికి వెళుతుంటారు. ఉప్పల్ లోని బాలాజీహిల్స్కు చెందిన వాల్మీకిరావు అనే భక్తుడు కూడా స్వామివారి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లారు. ప్రధాన ఆలయంలో దర్శనం తర్వాత పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో అక్కడ పూజారిగా పనిచేస్తోన్న ప్రభాకర శర్మ.. భక్తుడితో వాగ్వాదానికి దిగాడు. అనుమతి లేకుండా గుడి లోపలికి ఎలా వెళ్తావంటూ పూజారి ప్రభాకర్ శర్మ.. భక్తుడైన వాల్మీకిరావుతో వాగ్వాదానికి దిగాడు.
భక్తుడితో వాగ్వాదంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన పూజారి ప్రభాకర్ శర్మ.. వాల్మీకిరావుపై విచక్షణా రహితంగా ఆలయంలోనే దాడి చేశాడు. అర్చకుడు కొట్టిన దెబ్బలకు భక్తుడైన వాల్మికిరావు హుండీకి గుద్దుకొని కిందపడిపోయాడు. అయినాసరే తగ్గని పూపజారి.. వీధి రౌడీ మాదిరిగా భక్తుడిని తీవ్రస్వరంతో బెదిరించాడు. పూజారి చేతిలో దెబ్బలు తిన్న తర్వాత బాధితుడు వాల్మీకిరావు సమీపంలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా గణేశ్ టెంపుల్ లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, పూజారి ప్రభాకర్ శర్మ రౌడీ వ్యవహారం బట్టబయలైంది. బాధితుడు వాల్మికి రావు ఇదే విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన తనపై రౌడీ మాదిరిగా పూజారి దాడికి పాల్పడడం ఎంత వరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా దాడికి పాల్పడ్డ ఆలయ అర్చకుడు ప్రభాకర్శర్మపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. కాగా, రౌడీ పూజారికి ఇప్పటికే మెమోలు జారీ అయినట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.