మిర్యాలగూడలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు జైలు నుంచి విడుదలయ్యాడు. ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఆయన బెయిల్‌పై బయటకొచ్చాడు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో హైకోర్టు నిందితులందరికీ శనివారం నాడు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే, బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందడం ఆలస్యం కావడంతో మారుతీరావు విడుదల ఒక రోజు ఆలస్యమైంది. నిన్న రాత్రి బెయిల్ పత్రాలు జైలుకు అందడంతో, ఈ ఉదయం ఆయన విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు శ్రవణ్‌కుమార్, కరీంలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి మారుతీరావుతో తనకు ప్రాణాపాయం ఉందని ఆరోపిస్తుంది ప్రణయ్ భార్య అమృత.
తనకు భద్రత పెంచాలని పోలీసు అధికారులకు ఆమె కోరింది. మిర్యాలగూడలోని తమ నివాసంలో మామ పెరుమాళ్ల బాలస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను, న్యాయస్థానాన్ని కోరతామని వారు తెలిపారు. బెయిల్‌పై బయటకొచ్చిన నిందితులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్ 14న అమృతతో కలిసి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తోన్న ప్రణయ్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు. కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో అమృత తండ్రి మారుతీరావే.. ప్రణయ్‌ను హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అమృత తండ్రి మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, మరో వ్యక్తి కరీంను నిందితులుగా చేరుస్తూ పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Nalgonda, Pranay amrutha, Telangana, Telangana News