ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఓ ప్రధాన సాక్షి మరణించాడు. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు. బాలీవుడ్ బాద్ షా, ప్రముఖ సినీ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడైన ఆర్యన్ ఖాన్ ముంబైలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన పార్టీలో పాల్గొన్నాడు. క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ బాగోతం బయటపడటంతో ఈ కేసులో ప్రభాకర్ సెయిల్ ను ఎన్సీబీ సాక్షిగా పేర్కొంది. డ్రగ్ కేసులో మరో సాక్షి అయిన కేపి గోసావి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుగా సెయిల్ పనిచేస్తున్నాడు. అయతే శుక్రవారం ముంబై పరిధిలోని చెంబూర్‌లోని మహుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న సెయిల్ గుండెపోటుకు గురైనట్లు సెయిల్ తరపు న్యాయవాది ధృవీకరించారు.
సెయిల్‌కు తల్లి, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ప్రభాకర్ సెయిల్ మృతిపై అతని కుటుంబానికి ఎలాంటి అనుమానం లేదని అతని న్యాయవాది తెలిపారు.ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రధాన సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ మృతితో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. గ్రామం నుంచి సోదరులు, బంధువులు వచ్చాక దహన సంస్కరాలు నిర్వహిస్తామని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గతేడాది అక్టోబర్‌లో ముంబైలో చోటు చేసుకున్న ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ముంబై తీరంలో కార్డీలియా క్రూయిజ్ లైనర్ అనే నౌకపై ఎన్సీబీ అధికారులు దాడులుచేశారు. అందులో రేవ్ పార్టీ జరుగుతోందని, విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో సోదాలు చేశారు. క్రూయిజ్‌లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aryan Khan, Aryan khan drugs case, Bollywood news, Drugs case