ఫేస్బుక్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవితలపై అసభ్య ప్రచారం చేస్తున్న నెటిజన్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్బుక్ మాధ్యమాన్ని కొందరు అసభ్య కామెంట్లు, అసత్య ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. బయట ఎంతో హుందాగా వ్యవహారించే వాళ్లు కూడా సోషల్ మీడియాలో తమలోని నీచమైన యాంగిల్‌ను బయటపెడుతున్నారు. కొందరు రాజకీయ నేతలైతే సోషల్ మీడియాను నాయకులపై అసత్య ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల, తెలుగుదేశం పార్టీ నాయకురాలు సాధినేని యామిని, నారా లోకేశ్ వంటి వారు సోషల్ మీడియా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు, ఆయన కుమార్తె ఎంపీ కవితలపై ఫేస్బుక్ వేదికగా అసభ్య ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీనివాసయాదవ్ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు... దర్యాప్తు చేపట్టగా రెండు ఫేస్బుక్ ఖాతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీార్, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితలపై అసభ్య వార్తలు పోస్ట్ చేస్తున్నట్టు తేలింది. ఫేస్బుక్ నిర్వాహకుల సాయంతో ఆ రెండు ఖాతాల ఐపీ అడ్రెస్లు తీసుకున్న సైబర్ క్రైమ్ టీమ్... వాటి ఆధారంగా నెటిజన్ అడ్రెస్ కనిపెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబ్‌పేటలో ఉంటున్న చిప్రా నరేశ్ అనే ప్రైవేట్ ఉద్యోగి... ఈ రెండు ఖాతాలను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అతని అడ్రెస్‌కు చేరుకున్న పోలీసులు, నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన మరో పార్టీకి కార్యకర్తగా వ్యవహారించిన నరేశ్... టీఆర్ఎస్ నేత కేసీఆర్‌పై, ఆయన కుమార్తె కవితలపై ద్వేషం పెంచుకుని, ఫేస్బుక్ ద్వారా ఇలా అసభ్య ప్రచారం చేస్తున్నట్టు తేల్చారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Crime, Facebook, KTR, Lok Sabha Elections 2019, MP Kavitha, Nizamabad S29p04, Telangana