తమిళనాడును కుదిపేస్తున్న భారీ సెక్స్ రాకెట్ : వందల మంది అమ్మాయిలపై అఘాయిత్యాలు..

Tamilnadu Sex Racket : అన్నాడీఎంకె పార్టీకి చెందిన ఓ యువ నేత ఈ ముఠాకు అండగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైనా సరే.. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు.

news18-telugu
Updated: March 12, 2019, 4:59 PM IST
తమిళనాడును కుదిపేస్తున్న భారీ సెక్స్ రాకెట్ : వందల మంది అమ్మాయిలపై అఘాయిత్యాలు..
అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళల నిరసనలు(File)
  • Share this:
పొలాచ్చి సెక్స్ రాకెట్ తమిళనాడును కుదిపేస్తోంది. కేసుకు సంబంధించి అనేక సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడి పేరు కూడా ఇందులో ప్రధానంగా వినిపిస్తుండటం గమనార్హం.తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 200 పైచిలుకు మంది మహిళలు ఈ ముఠా బారిన పడ్డట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌నే అడ్డాగా చేసుకుని..కాలేజీ అమ్మాయిలకు, వివాహితలకు ఈ ముఠా గాలం వేసింది. ఆ గాలానికి చిక్కుకున్న ఎంతోమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఆర్థికంగా దోచుకోబడ్డారు. అయితే విషయం బయటకు చెబితే ఎక్కడ చంపేస్తారోనని.. సమాజంలో తలెత్తుకోలేమోనని.. ఈ ముఠాపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.దీంతో ఏడేళ్లుగా వీరి ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది.

ఫిబ్రవరి 24న ఎట్టకేలకు ఓ కాలేజీ విద్యార్థిని ఈ ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బయటపడుతున్న వివరాలను చూసి కేసును విచారిస్తున్న పోలీసులే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎప్పటిలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకుని సదరు ముఠాలోని శబరీ రాజన్ (25) అనే వ్యక్తి ఆ కాలేజీ అమ్మాయికి గాలం వేశాడు. ప్రేమగా మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెకు తనపై నమ్మకం ఏర్పడిందనుకున్న తర్వాత.. తనతో బయటకు రావాల్సిందిగా కోరాడు.


రాజన్ వెనకాల పెద్ద సెక్స్ రాకెట్ ఉందన్న విషయం తెలియక.. అతనిపై నమ్మకంతో చెప్పినచోటుకు ఆ అమ్మాయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లాక సతీష్‌, వంసతకుమార్‌ అనే స్నేహితులతో కలిసి రాజన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియోలు కూడా చిత్రీకరించాడు. అనంతరం కారులో తీసుకొచ్చి ఆమెను ఇంటివద్ద పడేసి వెళ్లిపోయారు. ఆపై ఆ ముఠా తరుచూ ఫోన్ చేయడం.. డబ్బుల కోసం వేధించడం.. లేదా తమ లైంగిక కోర్కెలు తీర్చాలనడం ఆమెకు పెద్ద టార్చర్‌గా తయారైంది.

అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని ఆ ముఠా బెదిరింపులకు దిగింది. అప్పటిదాకా తనలో తానే కుమిలిపోయిన బాధితురాలు.. ఎట్టకేలకు విషయాన్ని తన సోదరుడితో చెప్పింది. ఈ క్రమంలో ఆ ముఠాకు ఆమె సోదరుడికి మధ్య ఓసారి ఘర్షణ జరిగింది. చివరగా ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రుల సాయంతో ఫిబ్రవరి 24న పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా అఘాయిత్యాలు బయటపడ్డాయి.బాధితురాలి ఫిర్యాదుతో ముఠా సభ్యులైన శబరి రాజన్‌, సతీష్‌, నాగరాజ్‌ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల సెల్‌ఫోన్లలో దాదాపు 50మంది మహిళల నగ్న చిత్రాలు, అత్యాచార వీడియోలను గుర్తించారు. తమిళనాడు వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీరి బాధితులు ఉన్నారని గుర్తించారు. అన్నాడీఎంకె పార్టీకి చెందిన ఓ యువ నేత ఈ ముఠాకు అండగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైనా సరే.. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు.

First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>