POLICE SUB INSPECTOR RAPES AND ABORTED A WOMEN WHO CAME TO FILE COMPLAINT 8 BOOKED INCLUDING DOCTOR IN TAMILNADU MKS
shocking : ఈ పోలీసులకు ఏమైంది? -ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళపై అత్యాచారం -ఆ తర్వాత ఇంకా ఘోరంగా..
ప్రతీకాత్మక చిత్రం
మరో ఖాకీ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై ఎస్సై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను గర్బవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన ఉదంతంలో చివరికి కోర్టు జోక్యంతోగానీ డాక్టర్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. సంచలనం రేపిన తాజా ఘటనపై పోలీసులు చెప్పిన వివరాలివి..
ఈ నగరానికి ఏమైంది? అనే హెచ్చరిక ప్రకటన లాగానే ఈ పోలీసులకు ఏమైంది? అని జనం భయపడే ఘటనలు వరుసగా కలకలం రేపుతున్నాయి. గత వారం హర్యానాలోని రేవారీలో హెడ్ కానిస్టేబుల్ (Haryana police head constable) అనిల్, అతని సహాయకుడైన హోంగార్డు.. స్పా సెంటర్లో పనిచేస్తోన్న ఇద్దరు యువతను లాడ్జికి తీసుకెళ్లి, మరో స్నేహితుడితోకలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడటం, సదరు ఘటనపై ఐజీ స్థాయిలో ఎక్వైరీ తర్వాత కేసు నమోదు కావడం తెలిసిందే. మొన్నటికి మొన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే శేఖర్ (Hyderabad Police Constable).. తన సొంతూరు శకర్ పల్లిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయడం, చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో ప్రాధమిక దర్యాప్తు తర్వాత అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం విదితమే. మరోవైపు తమిళనాడులోని మధురైలో రాత్రి వేళ సినిమాకు వెళ్లొస్తున్న మహిళను అటకాయించి అత్యాచారానికి పాల్పడిన మురుగన్ అనే కానిస్టేబుల్ పైనా కేసు నమోదైంది. ఈ మూడు ఘటనల్ని మర్చిపోకముందే, అదే తమిళనాడులో మరో ఖాకీ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై ఎస్సై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను గర్బవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన ఉదంతంలో చివరికి కోర్టు జోక్యంతోగానీ డాక్టర్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. సంచలనం రేపిన తాజా ఘటనపై మార్తాండం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాలివి..
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలోన నివసించే మహిళ(32)కు వివాహమై తొమ్మిదేళ్ల కూతురు ఉంది. విభేదాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె, మరో వ్యక్తిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులకే అతనూ మోసం చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. మోసం చేసిన ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకుగానూ ఆమె పళుంగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, అప్పటి సబ్ ఇన్ స్పెక్టర్ సుందరలింగం(40) కంటపడింది. ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లే చేసి, దర్యాప్తులో సహకారం కావాలంటూ ఎస్సై సుందరలింగం మహిళ వెంటపడ్డాడు. పోలీస్ పవర్ కు భయపడి ఆమె కూడా రమ్మన్నచోటికి వెళ్లేది. ఈ క్రమంలో ఎస్సై పలు చోట్లకు తీసుకెళుతూ మహిళపై చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా..
ఎస్సై సుందరలింగం వల్ల బాధిత మహిళ గర్భందాల్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమెకు తెలియుకండా కడుపు తీయించేందుకు ఎస్సై పెద్ద స్కెచ్ వేశాడు. కేసు నిమిత్తమంటూ తన స్నేహితుల సాయంతో ఆటోలో మహిళను పులియరంగిలోని క్లినిక్ లో డాక్టర్ కార్మల్ రాణి(38) వద్దకు తీసుకెళ్లారు. సాధారణ వైద్య పరీక్షలు అని నమ్మించి అబార్షన్ చేయించారు. కడుపులో బిడ్డను బలవంతంగా తొలగించిన తర్వాతగానీ ఎస్సైపై తిరుగుబాటు చేసిందా మహిళ. తనకు జరిగిన అన్యాయంపై కకళియకోవిల్, మార్తాండం పోలీస్ స్టేషన్లలో పలుమార్లు ఫిర్యాదు చేసినా, డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాలను సంప్రదించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆమె న్యాయపోరాటానికి దిగింది..
ఫిర్యాదు నిమిత్తం స్టేషన్ కు వెళ్లగా ఎస్సై అత్యాచారానికి పాల్పడటం, గర్భవతిని చేయడం, స్నేహితులు, డాక్టర్ సహాయంతో అబార్షన్ చేయించిన తీరును పేర్కొంటూ తనకు న్యాయం చేయాల్సిందిగా బాధిత మహిళ కుళిత్తురై కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జడ్జి కీలక ఆదేశాలిచ్చారు. మహిళ పట్ల వరుస అకృత్యాలను గర్హిస్తూ, ఎస్సై సుందరలింగం, గణేశ్ కుమార్, అభిషేక్, డాక్టర్ కార్మల్ రాణి, దేవరాజ్ తదితర 8మందిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మార్తాండం ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సహా 8మందిపై కేసు నమోదైంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.