Lawyer Vaman Rao Murder Case: న్యాయవాది హత్య కేసు.. ఇవే కారణాలు.. పోలీసులు చెప్పిన విషయాలు

వామన్ రావు, నాగమణి (File)

Lawyer Murder Case: ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు మరియు ఇతర సాక్ష్యాల ద్వారా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

  • Share this:
    పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణహత్యకు గురైన న్యాయవాది వామన్‌రావు, నాగమణి దంపతుల కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు చిరంజీవి, కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన తీరును పోలీసులు వివరించారు. మృతుడు గట్టు వామన్ రావు మరియు అతని భార్య నాగమణి హైదరాబాదు నుంచి మంథనిలోని కోర్టుకు ఓ పని కోసం వచ్చారని తెలిపారు. తిరిగి హైదరాబాద్ కి వెళ్తున్న క్రమంలో పథకం ప్రకారం వారిని హత్య చేశారని వెల్లడించారు. ఈ హత్యకు కుంట శ్రీనుకి తోడుగా చిరంజీవి, కుమార్‌ సహకరించారని తెలిపారు. వామన్ రావు తన భార్య నాగమణితో కలిసి పెద్దపెల్లి వైపు వెళ్లే సమాచారం ముందుగానే తెలుసుకుని వారిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. వామన్ రావును కుంట శీను కారులో నుంచి బయటకు లాగి కత్తితో అతనిపై దాడి చేశాడని.. అదే సమయంలో చిరంజీవి రెండో పక్క నుండి వచ్చి వామన్ రావు భార్య నాగమణి పై కత్తితో దాడి చేశాడని తెలిపారు.

    తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ గుంజపడుగు, మరో వ్యక్తి అని అక్కడున్న వారితో వామన్ రావు తెలిపారని పోలీసులు వెల్లడించారు. దాడి జరిగిన తర్వాత వెంటనే కుంట శ్రీను, చిరంజీవి అక్కడి నుంచి పారిపోయారని.. దాడికి ఉపయోగించిన కత్తులను రెండింటిని సుందిళ్ల బ్యారేజీ నీటిలో పడవేసి అక్కడ నుంచి మహారాష్ట్రకి పారిపోయారని అన్నారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకు ప్రధాన ముద్దాయి కుంట శీనుకు ఐదు సంవత్సరాలుగా కోల్డ్ వార్ నడుస్తోందని పోలీసులు తెలిపారు. ఆయన ప్రతి విషయంలోనూ పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్లడంతో తన ఎదుగుదలకు వామనరావు అడ్డు వస్తున్నాడనే కారణంతో ఆయనను హత్య చేయాలని కుంట శ్రీను నిర్ణయానికి వచ్చాడని తెలిపారు.

    ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాల స్వామి దేవాలయం యాజమాన్య కమిటీ వివాదం,ఇల్లు నిర్మాణం మరియు కుల దేవత అయిన పెద్దమ్మ ఆలయం నిర్మాణం ఆపడంలో వామన్ రావు లిటిగేషన్స్ పెట్టడం వల్ల కుంట శ్రీను తట్టుకోలేకపోయారని.. పాత, కొత్త కక్షలు మనసులో పెట్టుకుని ఆయనను చంపేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు మరియు ఇతర సాక్ష్యాల ద్వారా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: