హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fake Facebook Accounts: పోలీసుల పేరుతో ఫేస్ బుక్ ఖాతాలు.. డబ్బులు కావాలంటూ మెసేజ్ లు!

Fake Facebook Accounts: పోలీసుల పేరుతో ఫేస్ బుక్ ఖాతాలు.. డబ్బులు కావాలంటూ మెసేజ్ లు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏకంగా పోలీసు అధికారుల పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠా పట్టుబడింది. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 230 మంది పోలీసు అధికారుల పేరుతో వీరు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలను తెరిచినట్లు విచారణలో తేలడం సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...

సోషల్ మీడియా వేదిక జరిగే నేరాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నకిలీ ఖాతాలను సృష్టించి ఇతరలను మోసం చేయడమే లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమార్కులు లక్షలు వెనకేసుకుంటున్నారు. తాజాగా ఏకంగా పోలీసు అధికారుల పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ సృష్టించిన ఓ ముఠా పట్టుబడింది. పోలీసుల పేరు, ఫొటోలతో నకిలీ ఖాతాలను తయారు చేయడం.. డబ్బు అవసరం ఉందంటూ ఆ ఖాతా ద్వారా ఇతరులకు మెసేజ్ పంపించి అడగడం వీరి పని. ఎట్టకేలకు ముఠా గుట్టుని నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో నగదు దోచుకుంటున్న రాజస్థాన్‌ ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు పట్టుబడగా.. మరో ఇద్దరు పారిపోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నల్లగొండ ఎస్పీ పేరిట ఖాతా..

గత నెల 18న నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ పేరిట సైతం వీరు ఫేస్‌బుక్‌లో దొంగ ఖాతా తయారు చేశారు. ఆ ఖాతా నుంచి ఓ వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి.. అతనికి మెసేజ్ లు పంపించసాగారు. తనకు రూ.20 వేలు కావాలని.. తన భార్య గూగుల్‌ పే ఖాతాకు ఆ డబ్బులు పంపించాలని కోరారు. అయితే అనుమానం వచ్చిన సదరు వ్యక్తి నల్లగొండ జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఎస్పీ మరో మిత్రుడికి సైతం ఇలాంటి మెజేజ్ వచ్చింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. వారు పంపించిన ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు అనేక సంచలన విషయాలు తెలిశాయి. రాష్ట్రంలోని అనేక మంది పోలీసుల పేరుమీద ఇలాంటి ఖాతాలు సృష్టించారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రానికి చెందిన ఐదుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 35 మంది కానిస్టేబుళ్ల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించినట్లు తేలింది.

రాజస్థాన్ లో చిక్కిన నేరగాళ్లు..

రాజస్థాన్‌లోని ఓ కుగ్రామంలో ఐదుగురితో కూడిన ఓ ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు పెద్దగా చదువుకున్నవారు కాదని విచారణలో తేలింది. ఆ గ్రామం మొత్తం స్టూవర్టుపురం తరహాలో నేరాలకు పాల్పడేవారే ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ నిందితుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండా పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిన సైబర్‌ టీమ్‌ రాజస్థాన్‌ పోలీసుల సహకారంతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరవడంలో ప్రధాన పాత్ర పోషించిన అయిదుగురిని గుర్తించారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ ముఠాలో ఓ మైనర్‌ బాలుడు కూడా ఉన్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 230 మంది పోలీసు అధికారుల పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలను తెరిచినట్లు చెప్పారు. ఆ ఖాతాల ద్వారా కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అంగీకరించారు. ఒక్కో నిందితుడి నుంచి దాదాపు 100 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: AP Police, CYBER CRIME, Facebook, Telangana Police

ఉత్తమ కథలు