Women thieves: వామ్మో.. వాళ్లు దుకాణంలోకి అడుగుపెడితే అంతే.. ఆ ఐదుగురు మహిళలు ఏం చేస్తారో తెలుసా..

మహిళలను అరెస్టు చేసిన పోలీసులు

Women thieves: వాళ్లంతా ఐదుగురు మహిళలు. ఏది చేసినా కలిసే చేస్తారు. జిల్లాలకు జిల్లాలే మారుతుంటారు. వాళ్లు ఒక దుకాణంలోకి అడుగుపెట్టారంటే చాలు.. ఇక అక్కడ ఏదో ఒకటి జరిగినట్టే. ఇలా ఓ దొంగతనం కేసులో దొరికిన వారిని పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. వివరాలిలా..

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  వాళ్లంతా ఐదుగురు మహిళలు. ఏది చేసినా కలిసే చేస్తారు. జిల్లాలకు జిల్లాలే మారుతుంటారు. వాళ్లు ఒక దుకాణంలోకి అడుగుపెట్టారంటే చాలు.. ఇక అక్కడ ఏదో ఒకటి జరిగినట్టే. బంగారం.. విలువైన బట్టలు.. వెండి వస్తువులు.. ఇలా ఏదైనా కొట్టేశారంటే ఎవరూ కనిపెట్టలేనంత చాకచక్యంగా.. పనికానిస్తారు. దుకాణంలో ఎంత మంది ఉన్నా వీరి చేతివాటాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేరంటే వీరి చౌర్య నైపుణ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వీరి పాపం పండింది. సీసీ కెమెరాల్లో వీళ్ల వేశాలు బయటపడ్డాయి. దీని ఆధారంగా వీరిని వెతికి పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చి వేలిముద్రలు తీసుకుని వెరిఫై చేస్తే.. వాళ్లంతా కాకలు తీరిన దొంగలని పోలీసులు నిర్ధారించారు. ఆధారాలతో సహా పాతిక కేసులు ఇప్పటికే వారి ఐదుగురిపై నమోదై ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేశాయి.  ఎలా దొరికారంటే.. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న బజార్ లోని శ్రీ నిధి జ్యుయలరీలో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదుగురు మహిళలు 60,000/-ల రూపాయల విలువైన రెండు జతల చెవి దిద్దులను దొంగిలించినట్లుగా ఫిర్యాదు వచ్చింది.

  స్పందించిన కొత్తగూడెం 3టౌన్ పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం అటు బంగారు నగల దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన ఆ అయిదుగురు మహిళలను గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారంతా కొత్తగూడెం బస్టాండ్ పరిసరాలలో సంచరిస్తున్నట్లు సమాచారాన్ని అందుకున్న త్రీ టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టి "ఫింగర్ ప్రింట్ స్కానర్" ద్వారా వారి వేలి ముద్రలను సేకరించారు. అయితే వీరిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదైనట్టు తేలిందని సిఐ వేణు చందర్ వెల్లడించారు. వారు గుగులోత్ గోబీ(55), భూక్యా బుల్లి(56), భూక్యా మంగతి(58), భూక్యా అంకు(60), భూక్యా సీత(57) గా పోలీసులు గుర్తించారు. ఈ ఐదుగురు మహిళా దొంగలు మహబూబాబాద్ జిల్లాలోని మంగమడుగు, నరసింహులుపేట లోని ఫకీరాతండా కి చెందిన వారుగా గుర్తించారు.

  వీరు వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గల బంగారు నగల దుకాణాలు మరియు బట్టల దుకాణాలకు వెళ్లి దుకాణదారుల దృష్టిని మళ్లించి బంగారు ఆభరణాలను మరియు బట్టలను దొంగిలించినట్లుగా విచారణలో తేలింది. వీరి నుంచి 60,000/-ల విలువ గల రెండు జతల చెవి దిద్దులను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్ట్ నకు తరలించారు. తక్షణమే స్పందించి సాంకేతికతను ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకొని కేసును ఛేదించిన త్రీటౌన్ సీఐ వేణుచందర్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ అభినందించారు.
  Published by:Veera Babu
  First published: