మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో మంచినీళ్ల తాగే పంపు కొడితే మద్యం వస్తోంది. ఈ విచిత్రమైన సంఘటనను ముందుగా పోలీసులే గుర్తించారు. గుణ(Guna)జిల్లాలో పోలీసులు (Police)తనిఖీలు చేయడానికి వెళ్లిన సందర్భంలో ఓ వ్యక్తికి చెందిన భూమిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బోర్ కనిపించడంతో కొట్టి చూశారు. అందులోంచి మద్యం రావడంతో షాక్ అయ్యారు.మంచినీళ్ల పంపు(Hand pump)లోంచి మద్యం రావడం ఏమిటని ఆశ్చర్యపోయారు పోలీసులు. బోరులోంచి వస్తోంది మద్యమేనా లేక నీళ్లే మద్యం వాసన వస్తోందా అనే కోణంలో పరిశీలించారు. తాము చెక్ చేస్తున్న దృశ్యాలను వీడియో(Video) తీస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
మంచినీళ్ల పంపులోంచి మద్యం ..
సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత వాస్తవాలు పూర్తిగా తెలియకుండానే ఏం జరిగినా ఒక వీడియో తీసి అద్భుతమైన సంఘటనగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మధ్య ప్రదేశ్లోని గుణ జిల్లాలో కూడా అదే జరిగింది. పంపులోంచి మద్యం వస్తోందనే వార్తకు సంబంధించిన వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
అసలు జరిగిందేమిటంటే అక్రమంగా మద్యం అమ్మేవాళ్లను పట్టుకుందామని వెళ్లిన సమయంలో పోలీసులకు ఈ అరుదైన మద్యం వస్తున్న పంపు కంటపడింది. మద్యం అమ్ముతున్నారని పోలీసులకు వచ్చిన సమాచారంతో రైడ్ చేస్తూ పోలీసులనే బురిడీ కొట్టించేందుకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి పెద్ద మొత్తంలో మద్యాన్ని డ్రమ్ముల్లో నింపి భూమిలో పాతిపెట్టాడు. అవసరమైనప్పుడు దాన్ని విక్రయించేందుకు వీలుగా ఓ పంపును అమర్చాడు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో కూడా ఆ పంపు కంటపడటంతో కొట్టి చూసారు. అందులోంచి మద్యం రావడంతో చేతిపంపు సమీపంలో తవ్వకాలు జరపి కింద డ్రమ్ములో నింపి నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈవిధంగా మద్యాన్ని నిల్వ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
అసలు జరిగింది తెలిస్తే ..
మధ్యప్రదేశ్లో పోలీసులు అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపే వాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏ మార్గంలో మద్యాన్ని సరఫరా చేసినా, అక్రమంగా నిల్వ చేసినా దాడులు చేసి పట్టుకుంటున్నారు. అక్రమ మద్యం విక్రయించే వాళ్లపై కేసులు బుక్ చేసి జైల్లో పెడుతున్నారు. అయినా కొందరు దేశముదుర్లు పోలీసుల కళ్లు గప్పి మద్యాన్ని ఈవిధంగా భూమిలో డ్రమ్ములతో నిల్వ చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhra pradesh, Trending news, Viral Video