news18-telugu
Updated: June 19, 2020, 1:20 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసందే. అందులో భాగంగానే ఇప్పటికే మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. బెల్టు దుకాణాలను పూర్తిగా లేకుండా చేసింది. మద్యం ధరలను సైతం భారీగా పెంచేసింది. మద్యం దుకాణాలను తగ్గించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మద్యానికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో కొంతమంది స్వార్థపరులు అక్రమాలకు తేరలేపారు. గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మద్యాన్ని పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా సరఫరా చేసేందుకు రకరకాల దారులను ఎంచుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వేరుశనగల ఆటోల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురు నిందితులను సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గాపురం స్టేజీ వద్ద కోదాడ పట్టణం నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు.
సుమారు 1.50 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోదాడ పట్టణంలోని ఓ వైన్స్లో మద్యం కొనుగోలు చేసి.. వేరుశనగల తరలింపు ముసుగులో.. వేరుశనగల కింద మద్యం బాటిళ్లను దాచి గుంటూరు జిల్లా తెనాలికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రెండు ఆటోలను సీజ్ చేసి.. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అనంతగిరి ఎస్సై రామాంజనేయులు తెలిపారు.
Published by:
Narsimha Badhini
First published:
June 19, 2020, 1:19 PM IST