AP Police: పోస్టుమార్టం రిపోర్టుకు లంచం అడిగిన పోలీస్.. వలపన్ని పట్టుకున్న ఏసీబీ!

ప్రతీకాత్మక చిత్రం

AP Police: ఏపీలో ఓ ఏఎస్ఐ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. తండ్రి పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వడానికి లంచం అడగడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

  • Share this:
    మానవత్వం మంట కలుస్తోందన్న మాటలకు నిదర్శనం ఈ ఘటన. రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుమారుడిని లంచం అడిగాడో పోలీసులు అధికారి. లంచం ఇస్తేనే పోస్టుమార్టం రిపోర్టు ఇస్తామని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన ఆ అవినీతి ఏఎస్ఐని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం..
    గత నెల 30న వైజాగ్ ములగాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్ కుమార్ పట్నాయక్, ఆయన తండ్రి మురళీధర్ తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు వీరిని హుటాహుటిన అంబులెన్స్ సహయంతో కేజీహెచ్ కు తరలించారు.

    చికిత్స పొందుతూ మురళీధర్ మృతి చెందాడు. అయితే రోడ్డు ప్రమాదం నేపథ్యంలో గాజువాక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో నరేష్ పట్నాయక్ తన తండ్రి పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సూర్యనారాయణను కోరాడు. అయితే ఆ ఏఎస్ఐ రూ. 5 వేలు ఇస్తేనే పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తానని తేల్చిచెప్పాడు. దీంతో బాధితుడు నరేష్ కుమార్ పట్నాయక్ ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో తన సిబ్బందితో వలపన్ని లంచం తీసుకుంటుండగా ఏఎస్ఐ సూర్యనారాయణను పట్టుకున్నారు. ఈ విషయమై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సూర్యనారాయణను విచారిస్తున్నారు.

    నెల రోజుల క్రితం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఆ సమయంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యమయ్యాయి. తన ప్రమాణస్వీకారం రోజునే రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అవినీతి అరికట్టడమే లక్ష్యంగా ఓ కాల్ సెంటర్ తీసుకొచ్చారు. 14400 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వంలో అవినీతి మీద ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఆ విధంగా గత కొన్ని రోజుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
    Published by:Nikhil Kumar S
    First published: