డబ్బు కావాలంటే సంపాదించాలి. లేదా అప్పు చెయ్యాలి. ఈ సింపుల్ లాజిక్ మిస్సైన అతను.. నేరం చేసేందుకు సిద్ధమయ్యాడు. పేరు సంజీవ్ సలాహుద్దీన్. వయసు 49 ఏళ్లు. వయసులో ఉన్నప్పుడు సంపాదించిందేమీ లేదు. ఇప్పుడు మనీ కోసం అడ్డగారిలో వెళ్లడం కరెక్టే అనుకున్నాడు. ఏం చేద్దామా అని ఆలోచించాడు. ఇంటర్నెట్లో గొలుసు దొంగలు ఏం చేస్తున్నారో గమనించాడు. తను కూడా అలా చేస్తే సరిపోతుంది.. ఏ నగో కొట్టేస్తే.. దాన్ని అమ్ముకుంటే.. భారీగా డబ్బు వస్తుంది అనుకున్నాడు. కానీ పోలీసులూ, చట్టం ఉంటుందని మర్చిపోయాడు.
ఎక్కడ చోరీ చెయ్యాలి అని ఆలోచించిన సంజీవ్‌కి ఓ విషయం అర్థమైంది. చైన్ స్నాచర్ల లాగా తాను బైక్ పై వెళ్లి.. చైన్‌ని లాగేయడం తన వల్ల కాదు అని అనుకున్నాడు. అందువల్ల ఓ సినిమాలో బ్రహ్మానందం లాగా చెయ్యాలి అనుకున్నాడు. కేరళ .. కొల్లంలోని కొన్ని ప్రాంతాల్లో స్కూటర్‌పై తిరిగాడు. ఓ చోట.. ఓ పెద్దామె గేదెకు ఆహారం వేస్తూ ఉంది. ఆమె మెడలో మెరుస్తూ గోల్డ్ చైన్ కనిపించింది. ఒలింపిక్ మెడల్ సాధించినంత ఆనందపడిపోయిన సంజీవ్.. అడ్రెస్ కావాలి అంటూ ఆమె దగ్గరకు వెళ్లి.. ఒక్కసారిగా కత్తి తీసి.. మెడ దగ్గర పెట్టి.. కదలకు అంటూ.. పుటుక్కున గోల్డ్ చైన్ లాగేసి.. స్కూటర్‌పై పారిపోయాడు. తొలి చోరీ విజయవంతంగా పూర్తైందని ఆనందపడ్డాడు.
ఆ బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. చోరీ జరిగిన ఏరియా మొత్తం సీసీటీవీల పర్యవేక్షణలో ఉంది. పోలీసులు కష్టపడాల్సిన పని రాలేదు. స్కూటర్ నంబర్ ఆధారంగా సంజీవ్ అడ్రెస్ మొత్తం తెలిసింది. తాడిక్కడ్ లోని కైతక్కడ్ వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకున్నారు. సంజీవ్‌కి పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. ఏ పనీ చెయ్యకుండా ఇంట్లోనే ఉంటున్నాడని దర్యాప్తులో తెలిసింది. అతన్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. రిమాండ్‌కి పంపారు.
ఇలా ఇళ్లలో పనులు చేసుకుంటున్నవారికి కూడా ఈ రోజుల్లో రక్షణ ఉండట్లేదు. సంజీవ్ లాంటి కొండెగాళ్లు.. అడ్డమైన స్కె్చ్లు వేసి.. అరాచకాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం మేలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news