దొంగతనాలు చేయడం కోసం దొంగలు ఎన్నో మారణాయుధాలు వాడుతుంటారు. కత్తులు, పొడవాటి తల్వార్లు వంటి వాటిని ఉపయోగించి దోపిడీ దొంగలు లూటీ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని ముఠాలు ఏకంగా దోపిడీల కోసం తుపాకులు కూడా వాడుతుంటాయి. స్మగ్లింగ్, మావోయిస్టుల ద్వారా తుపాకులను సేకరించి... వీటిని తమ దొంగతనాల కోసం ఉపయోగిస్తుంటారు. అయితే వరంగల్ జిల్లా పోలీసులకు చిక్కిన ఓ దొంగల ముఠా మాత్రం సొంతంగా తుపాకులు తయారు చేసుకుని మరీ దొంగతనాలను పాల్పడటం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ నెల 15న తుపాకులతో బెదిరించి రూ. 6.5 లక్షలను ఎత్తుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి దగ్గర పెద్ద పెద్ద తుపాకులు కూడా ఉన్నాయని బాధితులు చెప్పడంతో... కేసును సీరియస్గా తీసుకున్నారు. అయితే నిందితులను పట్టుకున్న పోలీసుల... వారి తుపాకుల వెనుక ఉన్న అసలు స్టోరీ తెలుసుకుని అవాక్కయ్యారు. తాము యూట్యూబ్లో చూసి తుపాకులను తయారు చేశామని నిందితులు చెప్పడమే ఇందుకు కారణం.
నక్సలైట్లు అని చెప్పుకుని డబ్బులు వసూలు చేయాలంటే తుపాకులు అవసరవుతాయని భావించిన ముఠాలోని ఓ సభ్యుడు... యూట్యూబ్ చూసి తుపాకులు తయారు చేశాడు. సైకిల్ బొంగులు, కర్ర, డ్రమ్స్, రాగిరేకు ఇలా... అందుబాటులో ఉండే వస్తువులతో నాటు తుపాకులతో పాటు అవసరమైన బులెట్లను తయారు చేశాడు. వీటి ద్వారా దోపిడీకి పాల్పడి వచ్చిన సొమ్మును పంచుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు పది బృందాలు పని చేశాయని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.