గుప్త నిధులు... ధన పిశాచి... రూ.18 లక్షలు హాంఫట్...

Andhra Pradesh : గుప్త నిధులు అంటే చాలు... కొంత మంది ఈ లోకాన్ని మర్చిపోతారు. అవతలి వాళ్లు చెప్పే కట్టుకథల్ని నమ్మేసి... అడ్డంగా బుక్కైపోతారు. ఇంతకీ ఈ కేసులో ఎలాంటి కథ అల్లారు... ఎలా బుట్టలో వేసుకున్నారు?

Krishna Kumar N | news18-telugu
Updated: July 19, 2019, 11:26 AM IST
గుప్త నిధులు... ధన పిశాచి... రూ.18 లక్షలు హాంఫట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురం జిల్లాలోని... శింగనమలలో నివసిస్తున్నారు అన్వర్ భాషా, దిల్‌షద్. కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగోకపోవడంతో... మాంత్రికుడితో తనకు మంత్రం వేయించమని భర్తను కోరిందామె. అన్వర్ భాషాకు మాంత్రికులు ఎవరూ తెలియరు. అందువల్ల అతను తన ఫ్రెండ్ మారుతికి ఈ విషయం చెప్పాడు. మారుతీ కూడా అదే టైపు. నీకెందుకు నేను చూసుకుంటా అంటూ... రాప్తాడు మండలానికి వెళ్లి... ఓబులేసుకి విషయం చెప్పాడు. ఓబులేసుకి ఇలాంటి విషయాలపై మంచి పట్టుంది. వెంటనే పుట్టపర్తి వెళ్లి... అశోక్ అనే మాంత్రికుణ్ని కలిశాడు. విషయం చెప్పాడు. పని పాటా లేకుండా ఉన్న అశోక్... వెంటనే కొన్ని పూజ సామగ్రి తీసుకొని బయల్దేరాడు. ఇంటికి రాగానే... కుక్కలా ఇల్లంతా వాసన చూశాడు. ఆ తర్వాత... అర్థమైంది అని గట్టిగా అరిచాడు. ఇంట్లో ధన పిశాచి ఉంది అన్నాడు. అది గుప్త నిధిలాగా... దాదాపు పది కేజీల బంగారం రూపంలో ఉందని అన్నాడు. దాన్ని బయటకు తేవాలంటే... రూ.10లక్షలు ఖర్చవుతుందన్నాడు. ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది ఆ భార్యాభర్తలకు.

10 కేజీల బంగారం నిజంగానే ఉందని అనుకున్న ఆ దంపతులు... పోతేపోయాయి డబ్బులు బంగారం తమ సొంతం అవుతుందని కలలుకన్నారు. గబగబా అప్పు చేసి... రూ.4 లక్షలు... మాంత్రికుడు అశోక్‌కి ఇచ్చారు. వెంటనే అశోక్... మరికొన్ని పూజా సామగ్రితో ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల్ని బయటకు పంపి... ఇంట్లో రెండు చోట్ల తవ్వాడు. ఆ తర్వాత... బంగారు పూత ఉన్న రెండు రాగి చెంబులు, కొన్ని గిల్ట్ నగలు, డూప్లికేట్ బంగారం బిస్కెట్ల వంటివి తనకు అక్కడ దొరికినట్లుగా భార్యాభర్తలకు చూపించాడు. ఓ నగను వాళ్లకు ఇచ్చి... మిగతావి మూట కట్టేశాడు. ఆ నగను బంగారం షాపులో చెక్ చేయించుకోమన్నాడు. అది బంగారంది అయితేనే... తనకు మిగతా డబ్బు ఇమ్మన్నాడు. మూట కట్టిన వాటిని మూడు నెలల వరకూ ఓపెన్ చెయ్యవద్దనీ, అలా చేస్తే... ఇద్దర్లో ఎవరో ఒకరు చనిపోతారని అన్నాడు. వాళ్లు సరే అన్నారు.

బంగారం షాపు యజమాని... అది నిజమైన బంగారు చైనే అన్నాడు. దాంతో మిగతావికి కూడా నిజమైనవే అని నమ్మిన ఆ దంపతులు అప్పు చేసి... మిగతా రూ.6 లక్షలు కూడా మాంత్రికుడు అశోక్‌కి ఇచ్చాడు. ఇదంతా చూసిన మారుతీ... ఆ మాంత్రికుణ్ని తన ఇంటికి కూడా తీసుకెళ్లాడు. అక్కడా ఇలాంటి డ్రామా ఆడిన అశోక్... అతని నుంచీ రూ.4లక్షలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ హోటల్ యజమాని కూడా అశోక్ బుట్టలో పడి రూ.4లక్షలు వదిలించుకున్నాడు. ఇలా అందర్నీ ముంచిన అశోక్... సైలెంట్‌గా పుట్టపర్తి నుంచీ చెక్కేశాడు.

మూడు నెలల తర్వాత... మూట తెరిచి చూస్తే... అప్పుడు అర్థమైంది మోసపోయారని అందరికీ. పుట్టపర్తికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే... మాంత్రికుడు పారిపోయాడని తెలిసింది. మధ్యవర్తిగా ఉన్న ఓబులేసును అడిగితే... తనకేమీ తెలిదయనీ, తను కూడా ఎవరో చెబితేనే ఆ మాంత్రికుణ్ని కలిశానని తెలిపాడు. ఇలా రూ.18 లక్షలు పోగొట్టుకున్న బాధితులు... పోలీసుల్ని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. పోలీసులు కేసు రాసి, దర్యాప్తు చేస్తున్నారు.
First published: July 19, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading