• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • PAYMENT APP AND ONLINE FRAUDS IN KHAMMAM DISTRICT MAY LOSE MONEY AND THREAT OF POLICE CASES AK KMM

Khammam: కొత్తరకం కేటుగాళ్లతో జాగ్రత్త.. డబ్బు స్వాహా.. కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం

Khammam: కొత్తరకం కేటుగాళ్లతో జాగ్రత్త.. డబ్బు స్వాహా.. కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం

ప్రతీకాత్మక చిత్రం

Khammam Online Frauds: ఆన్‌లైన్‌ మోసాలలో రోజుకోరీతిగా సాగుతున్న పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తతతో ఉండడం ఒక్కటే పరిష్కారమని పోలీసు అధికారులు చెబుతున్నారు.

 • Share this:
  కొద్ది రోజుల క్రితం ఖమ్మం ఆర్టీసీ బస్టాండు దగ్గరలోని ఓ దుకాణం వద్దకు ఓ కుర్రాడొచ్చాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని.. ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకొచ్చామని.. అక్కడ క్యాష్‌ మాత్రమే తీసుకుంటామని చెప్పారని.. తన అకౌంట్‌ నుంచి పేమెంట్‌ గేట్‌ వే ద్వారా మీకు డబ్బు పంపుతానని.. తనకు నగదు ఇవ్వాలని బతిమాలాడు. మొదట్లో అనుమానించినా అటు తండ్రి సెంటిమెంట్‌.. ఇటు తనకు అమౌంట్‌ ట్రాన్ష్‌ఫర్‌ చేసినట్టు చూపతుండడంతో సదరు వ్యక్తి నగదు ఇవ్వడానికి ప్రయత్నించాడు. సరిపోకపోవడంతో ఏటీఎం వద్దకు వెళ్లి మరీ ప్రయత్నించారు. అక్కడా రాకపోయేసరికి ఊరకుండిపోయాడు. చివరకు ఉన్న కొద్ది మొత్తం ఇచ్చి.. అతను ట్రాన్స్‌ఫర్‌ చేసిన మొత్తాన్ని తిరిగి అతని ఖాతాకే పంపేశాడు. ఇది జరిగిన రెండు రోజులకు సాయం చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తికి హైదరాబాద్‌ మహంకాళి పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ నరేష్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.. ఒక చోరీ కేసుకు సంబంధించిన ఫోన్‌లోని ఫోన్‌ పే ఆప్‌ నుంచి మీ అకౌంట్‌కు డబ్బు పంపారని.. అతను మీకు తెలిసినవాళ్లేనా అని ప్రశ్నించారు.

  దీంతో ఖంగుతిన్న సదరు దుకాణం యజమాని జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు ఆ ఎస్సైకు వివరించారు. దీంతో హైదరాబాద్‌లో సెల్‌ఫోన్‌ చోరీకి పాల్పడిన వ్యక్తి నేరుగా ఖమ్మం వచ్చి మోసం చేసే ప్రయత్నం చేశాడని తేలింది. ఈ వ్యవహారంలో అతను సెల్‌ఫోన్‌ లాక్‌ ఎలా తీశాడు..? ఫోన్‌పే సీక్రెట్‌ కోడ్‌ను ఎలా తెలుసుకున్నాడన్న విషయాన్ని పరిశోధించే పనిలో ఇప్పుడు పోలీసులున్నారు. ఫోన్‌ చోరీకి పాల్పడి.. నగదు మోసానికి ప్రయత్నించిన కేటుగాడితో తనకేమీ సంబంధం లేదన్న నిజాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ బాధితునిపైనే పడింది. ఎందుకంటే చోరీ చేసిన ఫోన్‌ నెంబర్‌ నుంచే తనకు రూ.20 వేలు బదిలీ అయ్యాయి.. నగదు ఇవ్వలేకపోయేసరికి తిరిగి అదే నెంబరుకు అంతే మొత్తాన్ని పంపాడు. ఇక్కడ తన అమాయకత్వాన్ని నిరూపించుకోలేకపోతే ఈ యువకుడు కూడా కేడీగాడికి సహకరించాడన్న కారణంగా కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  మరోకేసులో కొద్దిరోజుల క్రితం ఖమ్మం నగరానికే చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ మెసేజ్‌ వచ్చింది. రూ.96 వేల విలువ చేసే ప్రముఖ కంపెనీ ఫోన్‌ కేవలం రూ.38 వేలకే ఇస్తున్నామని.. ఆఫర్‌ ఉన్నంతవరకే సప్లై ఉంటుందని నమ్మించాడు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా సంప్రదించిన ఆ పెద్దమనిషి అతని మాటలు నమ్మి ఫోన్‌పే ద్వారా రూ.23 వేల నగదును ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయినా సెల్‌ఫోన్‌ రాలేదు. కొద్దిరోజులు ఎదురుచూసి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినా అవతలి నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో మోసపోయానని గుర్తించిన సదరు పెద్దాయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఇలా నిత్యం ఏదో ఒక చోట మనలో ఎవరో ఒకరు ఆన్‌లైన్‌ పేమెంట్ల విషయంలో నమ్మకానికి పోయో.. లేదా ఆశకు పోయో మోసపోతునే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ చొరవతో ఖమ్మంలోనే ఓ సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడ ఎలాంటి సైబర్‌ కేసు రిపోర్టు అయినా ఇక్కడకు బదిలీ అవుతుంది. ఇక్కడ ఉండే టెక్నీషియన్లు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ సైబర్‌క్రైం యూనిట్‌తో సమన్వయం చేసుకుంటూ కేసులను ట్రేస్‌ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ అసలు అప్రమత్తతతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో యాక్టివ్‌గా ఉండేవారి ఫేస్‌బుక్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి డబ్బు అవసరం ఉందన్న రిక్వెస్టులు పంపడం.. తర్వాత వాళ్లు చూసుకుని హ్యాక్‌ కు గురైందని ఫిర్యాదులు చేయడం తెలిసిందే. ఇలా ఆన్‌లైన్‌ మోసాలలో రోజుకోరీతిగా సాగుతున్న పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తతతో ఉండడం ఒక్కటే పరిష్కారమని పోలీసు అధికారులు చెబుతున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు