PARENTS BOOKED OVER CHILD MARRYING 12 YEARS OLD GIRL IN THE NAME OF BIRTHDAY CELEBRATION IN RANGAREDDY DISTRICT MKS
Shameful : పుట్టినరోజు పేరుతో 12ఏళ్ల పాపకు పెళ్లి చేశారు.. రంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన
ప్రతీకాత్మక చిత్రం
పుట్టినరోజంటే పిల్లలు ఎంతగా ఎంజాయ్ చేస్తారు కదా. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం బర్త్ డే పేరుతో తమ 12 ఏళ్ల బిడ్డకు 35 ఏళ్ల యువకుడిని ఇచ్చి బాల్య వివాహం జరిపించారు. రంగారెడ్డి జల్లాలో చోటుచేసుకుందీ ఘటన..
పుట్టినరోజంటే పిల్లలు ఎంతగా ఎంజాయ్ చేస్తారు కదా. ఫ్రెండ్స్ తోపాటు బంధువులనూ పిలిచి పార్టీ చేశామంటే పిల్లల సంతోషానికి అవధులే ఉండవు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ 12 ఏళ్ల పాప కూడా అలాంటి ఆనందాన్నే పొందింది. కానీ ఆమెకు అర్థం కాకుండానే పుట్టినరోజు వేడుక ముసుగులో బాల్య వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఆ చిన్నారిని 35 ఏళ్ల యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తనకేం జరిగిందో ఆలస్యంగా అర్థమైన తర్వాత ఆ బాలిక చిన్నపాటి తెగువతో ప్రస్తుతానికైతే నరకాన్ని తప్పించుకోగలిగింది. వివరాలివే..
ఓవైపు అమ్మాయిల వివాహ కనీస వయసు పెంపుపై సీరియస్ చర్చ జరుగుతుండగా.. బేటీ బచావో లాంటి కార్యక్రమాలు కొనసాగుతుండగా.. దేశంలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటన విశ్వనగరం హైదరాబాద్ ను ఆనుకుని ఉండే రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుక పేరుతో 12 ఏళ్ల పాపకు పెళ్లి జరిపించిన తల్లిదండ్రుల వ్యవహారం సంచలనంగా మారింది. పాపను కాపాడిన ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడకు చెందిన తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కూతురికి బాల్య వివాహం జరిపించారు. ఆ చిన్నారిని 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. అమ్మాయి పుట్టిన రోజు వేడుకల పేరుతో బాల్య వివాహ తంతు నిర్వహించారు. తనకు జరిగింది పెళ్లి అని ఆలస్యంగా గ్రహించిన బాలిక.. తల్లిదండ్రుల నుంచి తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్లింది.
చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా ఆ తల్లిదండ్రులు.. బాలికకు ఆశ్రయం ఇచ్చిన బంధువులతో గొడవ పెట్టుకున్నారు. అక్కడ కూడా తనకు రక్షణ లేదని ఆ పాప బోరున విలపించింది. ఊళ్లో చోటుచేసుకున్న ఈ తతంగం గురించి తెలిసిన వెంటనే స్థానిక ఐసీడీఎస్ సిబ్బంది.. పై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అందరూ కలిసి పాపిరెడ్డిగూడ చేరుకుని బాధితురాలిని చేరదీశారు.
అమ్మానాన్నలే బర్త్ డే పేరిట తనకు పెళ్లి జరిపించారని బాధిత బాలిక గ్రామస్తులు, ఐసీడీఎస్ అధికారుల ముందు చెప్పేసింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికను ఇంట్లోనే ఉండనీయాలా, లేక మెరుగైన రక్షణ ఉండే చోటికి తరలించాలా అనే విషయమై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.