మూడు ముళ్ల బంధం ఆమె పాలిట ముళ్ల కిరీటంగా మారింది. నూరేళ్లు సాగాల్సిన సంసారం మూడు నెలలకే కూలిపోయింది. కన్యాదానంతో పాటు అల్లుడు కోరిన విధంగా కట్న, కానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. నవ్వుతూ మెట్టినింటికి వెళ్లిన అమ్మాయికి అదనపు కట్నం రూపంలో వేధింపులు ఎదురవడంతో భరించలేకపోయింది. ఆదిలాబాద్ (Adilabad)జిల్లా నేరడిగొండ (Neradigonda) మండలం రాజుర(Rajura)గ్రామంలో ఈదారుణం చోటుచేసుకుంది. ఈ అదనపుకట్నం వేధింపుల(Extra dowry harassment) కేసులో అమ్మాయి తరపు బంధువులు ఒకలా చెబుతుంటే..అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు మరో విధంగా చెబుతున్నారు.
వివాహిత మృతిపై ఆరోపణలు..
బోథ్ మండలం కండేపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ శ్యామల దంపతులకు ఓ కుమార్తె ఉంది. 26సంవత్సరాల సంతోషిని రాజుర గ్రామానికి చెందిన పృథ్వీరాజ్‌కి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పృథ్వీరాజ్ తల్లిదండ్రులు అడిగిన విధంగా కట్న, కానుకలు ఇచ్చి..ఘనంగా వివాహం జరిపించారు సంతోషి తల్లిదండ్రులు. అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేయడంతో పాటుగా 18.50 లక్షల నగదుతో పాటు బంగారం ఇతర లాంచనాలు ముట్టజెప్పారు. సంతోషికి వివాహం మూడు నాళ్ల ముచ్చటగా మారింది. శుక్రవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని సంతోషి భర్తే స్వయంగా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
అదే చావుకు కారణం..
శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో సంతోషి భర్త పృథ్వీరాజ్ మృతురాలి తండ్రి ప్రకాష్‌కు ఫోన్ చేసి సంతోషి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన రాజుర గ్రామానికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కూతురును చూసి బోరున విలపించారు. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారం ప్రకారం స్పాట్‌కి చేరుకున్న ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అదనపు కట్నం కోసమే..
సంతోషి ఆత్మహత్య చేసుకుందని భర్త, అత్తమామలు చెబుతుంటే ..ఆమె తల్లిదండ్రులు మాత్రం సంతోషిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు తెలిపారు. అదనపు కట్నం కోసం తమ బిడ్డను మెట్టినింటి వాళ్లు వేధించారని..అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే 6లక్షలు ఇస్తే ఆ డబ్బుతోనే నిర్మల్‌లో ఓ ఫ్లాట్ కూడా తీసుకున్నారని..దాని రిజిస్ట్రేషన్ చేయాల్సిన రోజే తమ బిడ్డ చనిపోయిందని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈకేసులో తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఏడాదికే నూరేళ్లు నిండాయి..
సంతోషి మృతి విషయంలో తల్లిదండ్రులు ఆందోళనకుదిగారు. ఈకేసులో ఏఎస్పీ కలుగచేసుకొని సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈకేసులో నేరం చేసిన వాళ్లు ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సంతోషి మృతదేహానికి బోథ్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపధ్యంలో భర్త పృథ్వీరాజ్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు, ఆడపడుచులు, అల్లుళ్లను విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Crime news, Telangana