Pak Drone : కశ్మీర్ లో కలకలం..బోర్డర్ లో గ్రనేడ్లు,బాంబులతో వచ్చిన పాక్ డ్రోన్ కూల్చివేత!
ప్రతీకాత్మక చిత్రం
Pak Drone Shot Down : ఇటీవల కాలంలో భారత్ కు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తులు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. కశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటున్నాయని, అందుకే డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో ఆయుధాల సరఫరా సాగుతుందని సమాచారం.
Pak Drone Shot Down : ఇటీవల కాలంలో భారత్ కు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తులు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. కశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటున్నాయని, అందుకే డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో ఆయుధాల సరఫరా సాగుతుందని సమాచారం. ముఖ్యంగా పంజాబ్ సరిహద్దులో హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని భద్రతా వర్గాలు చెప్పాయి. కొద్ది నెలలుగా జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు ఎక్కువయ్యాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ లోకి ప్రవేశించిన ఓ డ్రోన్‌ను ఆదివారం ఉదయం భద్రతా బలగాలు కూల్చివేశాయి. రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలి హరియాచక్ ప్రాంతంలోని సరిహద్దు నుంచి ఉదయం డ్రోన్ కదలికను గుర్తించామని, వెంటనే సెర్చ్ పార్టీ దానిపై కాల్పులు జరిపిందని పోలీసులు ప్రతినిధి తెలిపారు. కింద నుంచి కాల్పులు జరపడంతో డ్రోన్ కూలిపోయిందని చెప్పారు.
తాలి హరియా చాక్ సరిహద్దుల్లో డ్రోన్ ఎగురుతుండటం కనిపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరిపినట్లు, కాల్పులు జరపడంతో అది కూలిపోయినట్లు జమ్ముకశ్మీర్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ డ్రోన్ లో పేలుడు పదార్ధాలున్నాయా అనే అనుమానంతో భద్రతా దళాలు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. డ్రోన్ మోసుకొచ్చిన పెద్ద బాక్సులో 7యూబీజీఎల్(అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు), 7 మ్యాగ్నెటిక్ బాంబులును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు. సరిహద్దుల్లో గత కొంత కాలంగా డ్రోన్ల కదలికలు ఎక్కువవడంతో ఆయా ప్రాంతాల్లో నిరతరం నిఘా ఉంచామని అధికారులు వెల్లడించారు. డ్రోన్ కదలికలు ఎక్కువవడంతో జమ్మూ కశ్మీర్లో భద్రతా సంస్థల అధికారులు అప్రమత్తమై.. నిరంతరం నిఘా పెడుతున్నాయి. తమ యాంటీ డ్రోన్ సిస్టమ్ సామర్థ్యాన్ని, జామింగ్ టెక్నాలజీని విస్తరించాయి. అయితే, కశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆయుధాలతో డ్రోన్ కనిపించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే నిఘా విభాగం హెచ్చరికలతో ఇప్పటికే ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 43 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్ 30న మొదలవుతుంది.
కాగా,ఈ ఏడాది ఏప్రిల్ 30న పంజాబ్‌లోని అమృత్సర్ సెక్టార్లో పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్‌ను కూల్చివేసినట్లు సరిహద్దు భద్రతా దళం వెల్లడించింది. అమృత్సర్ సెక్టార్‌లోని ధనో కలాన్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన బీఎస్ఎఫ్ సిబ్బంది ఎగిరే వస్తువు శబ్దం విని దానిని కాల్చి వేశారు. మే 1న ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ధనో కలాన్ గ్రామం సమీపంలో సెర్చ్ టీమ్ బ్లాక్ కలర్ మేడ్ ఇన్ చైనా క్వాడ్‌కాప్టర్ (డ్రోన్), మోడల్ DJI మ్యాట్రిస్-300ని స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.