news18
Updated: November 6, 2020, 12:29 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 6, 2020, 12:29 PM IST
భారత్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం.. హెల్మెట్ లేకపోవడం.. వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. 2019లో అతి వేగం కారణంగా ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను రోడ్డు ప్రమాదాల వార్షిక నివేదిక (annual road accident report)లో ఆ శాఖ అధికారులు వెల్లడించారు. 2019లో మన దేశంలో మొత్తం 4,49,002 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 1,51,113 మంది చనిపోయారు. మరో 4,51,361 మంది గాయపడ్డారు. వీటి ప్రకారం.. దేశంలో సగటున ప్రతిరోజూ 1,230 రోడ్డు ప్రమాదాలు, 414 మరణాలు నమోదవుతున్నాయి. అంటే ప్రతి గంటకు 51 ప్రమాదాలు జరుగుతుండగా, 17 మంది చనిపోతున్నారని అర్థం.
అతి వేగంతో ప్రయాణించే వారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని నివేదికలో పొందుపరిచారు. ఈ కారణం వల్లే ఎక్కువ ప్రమాదాలు, మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల్లో అధిక వేగం కారణంగా జరిగే ప్రమాదాలు 71 శాతం, చనిపోయే వారు 67.3 శాతం (1,01,699 మరణాలు), గాయాల బారిన పడుతున్నవారు 72.4 శాతం ఉన్నట్లు నివేదికలో ఉంది.
ఆ తరహా మరణాలే ఎక్కువ..
మొత్తం ప్రమాదాల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, లెర్నర్ లైసెన్స్ ఉన్నవారు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య 15 శాతం వరకు ఉంది. రోడ్లపై ఉండే గుంతల కారణంగా 2019లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 6.2 శాతం పెరిగింది. ఈ కారణంతో గతేడాది చనిపోయిన వారి సంఖ్య 2,140 వరకు ఉంది. 10 సంవత్సరాలు పైబడిన వాహనాలను వాడటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 41 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 32.9 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 67.1 శాతం మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.

ప్రతీకాత్మక చిత్రం
పాదాచారులూ బలవుతున్నారు..
రోడ్డు ప్రమాదాలలో మరణించిన పాదచారుల సంఖ్య 14.13 శాతం పెరిగింది. 2018లో 22,656 మంది పాదచారులు చనిపోగా, 2019లో ఈ సంఖ్య 25,858కు పెరిగింది. ద్విచక్ర వాహనాల కారణంగానే 54 శాతం మంది పాదచారులు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల వల్లే పాదచారులకు ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.ఓవర్లోడ్ చేసిన వాహనాల వల్ల 10 శాతం మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం ప్రమాదాలలో ఈ వాటా ఎనిమిది శాతం. గతేడాది మొత్తం 69,621 (15.5 శాతం) 'హిట్ అండ్ రన్' కేసులు నమోదయ్యాయి. వీటి వల్ల 29,354 మంది (19.4 శాతం) చనిపోగా, 61,751 (13.7 శాతం) మంది గాయాలపాలయ్యారు. 2018తో పోలిస్తే హిట్ అండ్ రన్ కేసులు 1.5 శాతం పెరిగాయి. ఈ కేసుల్లో చనిపోయిన వారి సంఖ్య 0.5 శాతం పెరిగింది. 2019లో మోటారు వాహనాల (సవరణ) చట్టం అమల్లోకి వచ్చిన తరువాత రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గడం విశేషం.
Published by:
Srinivas Munigala
First published:
November 6, 2020, 12:27 PM IST