ఓ కాలనీలో ముగ్గురు.. మరో కాలనీ లో నలుగురు.. అటువైపుగా వెళ్తే మరో వీధిలో ఆరుగురు.. ఇవేమీ జనాభా లెక్కల గణన కాదు. మూడు రోజులుగా హర్యానాలోని సంభవిస్తున్న మరణాల సంఖ్య. గత మూడు రోజులుగా హర్యానాలో అంతుచిక్కని విధంగా మరణాలు సంభవిస్తున్నాయి. మరి వీళ్లనెవరూ చంపింది లేదు.. ఆత్మహత్యా చేసుకోలేదు. ఎవరికీ ప్రమాదాలు జరగడం లేదు. ఈ అంతుచిక్కని మరణాల గురించి పోలీసులు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటుంది. అసలు ఎందుకు జరుగుతున్నాయీ మరణాలు.. హర్యానాలో ఏం జరుగుతున్నది..?
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి ఇరవై మందికి పైగా మృతి చెందడం రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. సోనిపట్ లోని మయూరినగర్, శాస్త్రి నగర్ కాలనీ, ప్రగతినగర్ కాలనీలో ఈ మరణాలు సంభవించాయి. అంతుచిక్కకుండా సాగుతున్న ఈ మరణాల గురించి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మృతుల బంధువులు అందులో ఇప్పటికే 15 శవాలను పోలీసులకు చెప్పకుండానే దహనం చేశేసారు. అయితే నాలుగు మృతదేహాలను మాత్రం శవపరీక్షల నిమిత్తం పంపారు. ఇందుకు సంబంధించిన వివరాలు రావాల్సి ఉంది.
సోనిపట్ లో ఈ మరణాలు సంభవిస్తున్న ఏరియా అంతా దినసరి కూలీల, కాయాకష్టం చేసుకునే వారితో నిండి ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో లిక్కర్ అమ్మకాలు కూడా ఎక్కువగానే జరుగుతాయి. పొద్దంతా కష్టం చేసి అలసిపోయిన కార్మికులు.. సాయంత్రం కాగానే కొంత మద్యం సేవించి ఇంటికెళ్తారు. కాగా, వారు తాగే లిక్కరే.. ఈ 20 మంది ప్రాణాలు తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్మికుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న లిక్కర్ మాఫియా కల్తీ లిక్కర్ ను తయారుచేస్తున్నదని.. అందులో విషపూరిత రసాయనాలను కలిపి వారికి అమ్ముతుందని అనుమానిస్తున్నారు. శవపరీక్ష కు పంపిన వారికి సంబంధించిన రిపోర్టులు వస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
కాగా, మూడు రోజుల నుంచి వరుసగా మరణాలు సంభవిస్తున్న ప్రాంతానికి సోనిపట్ డిప్యూటీ కమిషనర్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి బాధితులను ఓదార్చారు. ఈ మరణాల వెనుక ఉన్నదెవరో తేల్చుతామని వారు తెలిపారు. ఒకవేళ కల్తీ మధ్యమే వారి చావుకు కారణమైతే... సదరు లిక్కర్ షాపు ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana