కలకాలం కలిసుండాలని, జీవితాంతం ఒక్కటిగా బతుకుదామని ప్రతినలు పూనిన ఎంతో మంది ప్రేమికుల కల కల్లగా మిగులుతుంది. కులం, మతం కారణాలతో పెద్దలు పెళ్లికి నిరాకరించడం.. వారిని ఒప్పించలేక అర్ధాంతరంగా ప్రాణాలు వదలడం ప్రేమికులకు షరా మాములైంది. తాజాగా మహరాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆదివారం ఉదయం జల్గావ్ జిల్లా వాడే గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే బతికున్నప్పుడు వీరి కోరికను తీర్చని పెద్దలు, చనిపోయిన తర్వాత శ్మశానంలోనే వీరికి వివాహం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వాడే గ్రామానికి చెందిన ముఖేశ్ సోనావానే(22), పలాడ్కు చెందిన నేహ ఠాక్రే(19) ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరికీ వరస కుదరదని నేహ తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో కుటుంబం ఇంక తమ బంధాన్ని అంగీకరించరని భయపడిన ఈ ప్రేమ జంట.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
నేహ గత కొన్ని నెలలుగా తన బంధువుల గ్రామమైన వాడేలోనే ఉంటోంది. వీరిద్దరూ ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరం ఒకే కులానికి చెందిన వారు కావడంతో పెళ్లికి ఒప్పుకోవాలని నేహా కుటుంబంతో ముఖేష్ వివాహ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారని, ఇందుకు తాము అంగీకరించమని యువతి వైపు పెద్దలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ప్రేమ జంట ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారు.
మరణం తర్వాత నెరవేరిన కల..
ఇద్దరూ కలిసి ఉరేసుకునే ముందు.. ముఖేష్ వాట్సాప్ స్టేటస్‌లో 'బై' చెబుతూ ఒక పోస్ట్ చేశాడు. ఆదివారం ఉదయం వీరు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే శవపరీక్ష తర్వాత ఇరువురి మృతదేహాలను వాడే గ్రామానికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. వీరిద్దరికీ తుది క్రతువులను విడివిడిగా నిర్వహించినప్పటికీ.. శ్మశానంలో ఏక కాలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరినీ ఒకేసారి దహనం చేయడంతో.. మరణించాక వివాహం చేసుకొని, ఈ ప్రేమికులు తమ కలను నేరవేర్చుకున్నారని స్థానికులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Love, Lovers, Lovers suicide, Maharashtra