హోమ్ /వార్తలు /క్రైమ్ /

Online Loans: అమ్మో ఆన్ లైన్ అప్పులోళ్లు.. క్లిక్ చేస్తే కొంప మునిగినట్లే..

Online Loans: అమ్మో ఆన్ లైన్ అప్పులోళ్లు.. క్లిక్ చేస్తే కొంప మునిగినట్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రూగదేశ్ లో (Andhra Pradesh) ఇన్ స్టంట్ లోన్ యాప్ (Instant loan apps) బాధితులు పెరిగిపోతున్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లో 200కు పైగా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

సాధారణ, మధ్య తరగతివాళ్లే వారి టార్గెట్. అవసరాలకు అప్పు ఇస్తారు. కట్టకపోతే వడ్డీకింద ప్రాణాలు తోడేస్తారు. క్లిక్ చేస్తే లోన్ అంటూ మభ్యపెట్టి అప్పు అటగట్టి ఆపై చుక్కలు చూపిస్తారు. ఇదీ ప్రస్తుతం ఆన్ లైన్ లో సాగుతున్న లోన్ల దందా. ఆన్ లైన్ యాప్ లలో అప్పులు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇన్ స్టంట్ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకొని ఒక్క విశాఖ నగరంలోనే 15 రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. ప్రశాంతంగా ఉండే మధ్యతరగతి జీవితాల్లో ఆన్ లైన్ అప్పులు చిచ్చు రేపుతున్నాయి. ‘స్మాల్‌ వ్యాలెట్‌’, ‘బబుల్‌ లోన్‌’ ‘గో క్యాష్‌’, ‘బిలియన్‌ క్యాష్‌’ లోన్‌ బజార్‌ వంటి పేర్లతో వందలాది యాప్‌లను రూపొందించి గూగుల్‌ ప్లే స్టోర్‌లో వదులుతున్నారు. ఇలాంటి యాప్ లు ఒకటికాదు రెండుకాదు దాదాపు 200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు..!

ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు గడిపే వారికి ఆయా యాప్స్‌ లింక్ పంపుతారు. మీకు లోన్ అప్రూవ్ అయిందని లింక్ క్లిక్ చేయాలని ఫోన్ కు మెసేజ్ పెడతారు. చిన్న చిన్న అవసరాలకు మీ దగ్గర డబ్బుల్లేవా..? ఐతే తక్కువ వడ్డీకి మేం అప్పిస్తాం.. షూరిటీ అస్సలు అవసరమే లేదు. అంటూ బుట్టలో వేస్తారు. లింక్ ఓపెన్ చేసి తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్తారు. వాటిని ఓపెన్‌ చేయగానే ఫొటో, ఆధార్‌ కార్డుతోపాటు సెల్‌ఫోన్‌లో గూగుల్‌ డ్రైవ్‌కు సింక్‌ అయిన కాంటాక్టు నంబర్లు తమకు పంపిస్తే చేస్తే వెంటనే రూ.3 వేలు నుంచి రూ.50 వేలు వరకూ అప్పు ఇస్తామంటారు. అప్పులో 10శాతం ప్రాసెసింగ్‌ చార్జీల కింద కట్ చేసి మిగిలిన ఎమౌంట్ గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. రుణం తీర్చేందుకు 15 నుంచి 20 రోజులు మాత్రమే టైమ్ ఇస్తారు. సకాలంలో చెల్లించకుంటే వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ, లేట్ పేమెంట్ ఛార్జీలు.. ఇలా తీసుకున్న అప్పు గోరంత అయితే.. వడ్డీ కొండంత పెరుగుతుంది. డెడ్ లైన్ దాటిన తర్వాత వేధింపుల పర్వం మొదలవుతుంది. అప్పు తీర్చనివాడివి ఎందుకు తీసుకున్నావ్., నీకు బ్రతికే అర్హత ఉందా అంటూ నీచంగా మాట్లాడతారు. డీఫాల్టర్ గా ప్రకటించి బంధువులు, ఫ్రెండ్స్ కి మెసేజ్ లు పంపి పరువు తీస్తారు.

15 రోజుల్లో ఇద్దరు బలి...

ఇలాంటి వేధింపులు పడలేక విశాఖలో ఇద్దరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గాజువాక సుందరయ్య కాలనీకు చెందిన ఎం.అహ్లాద MBA చదువుకుంది. ఆమె తండ్రి కూరగాయల వ్యాపారం నిర్వహించేవారు. కరోనా సమయంలో వ్యాపారం దెబ్బతినడంతో ఆయన వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. ఆహ్లాద హోం ట్యూషన్స్ చెప్పేది. ఇటీవల అవసరానికి డబ్బు లేకపోవడంతో ఓ యాప్ నుంచి రూ.7వేలు అప్పు తీసుకుంది. ఆ తర్వాత మరికొంత లోన్ తీసుకుంది. ఇలా 7 యాప్ నుంచి రూ.40వేల వరకు అప్పు చేసింది. ఇందులో చాలా వరకు తీసుకున్న అప్పు చెల్లించడానికి మరో యాప్ లో లోన్ తీసుకుందే తప్ప సొంత అవసరాలకు వాడుకోలేదు. గడువు నాటికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో మరో రెండు రోజులు గడువు కోరింది. ఆ తర్వాత లోన్ కట్టడం చేతకానప్పుడు నువ్వు బ్రతకడం ఎందుకని వాయిస్ మెసేజ్ లు వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్ కి కూడా మేసెజ్ లు చేసి పరువు తీస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. అలాగే గోపాలపట్నంకు చెందిన ఓ మర్చంట్ నేవీ ఉద్యోగి కూడా ఇలాగే ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్ లైన్ రమ్మీకి బానిసపై లక్షల్లో పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 12లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

లాక్ డౌన్ కారణమా..?

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో పేద, మధ్య తరగతి వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చిన్నచిన్న అవసరాల కోసం యాప్ ల ద్వారా అప్పులు తీసుకోని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ యాప్ లోన్స్ మాఫియా టార్గెట్ కూడా మధ్యతరగతి ప్రజలే. బెదిరింపులకు భయపడి ఎక్కువ వడ్డీలు చెల్లిస్తారన్నది వారి లెక్క. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలో చాలా చోటు చేసుకుంటున్నాయి. కొందరు తమకున్న చిన్నపాటి ఆస్తులు, ఇళ్లను అమ్మి మరీ ఆన్ లైన్ అప్పులకు వడ్డీలు కట్టి బయటపడుతున్నారు. అలా తీర్చలేని వారు ప్రాణాలు తీసుకుంటున్నారు.

First published:

Tags: Bank loans, FAKE APPS

ఉత్తమ కథలు