ODISHA POLICEMAN STEALS GOATS TO THROW NEW YEAR FEAST LATER ASI SUSPENDED IN THIS CASE SK
Police Steals Goat: న్యూ ఇయర్ దావత్ కోసం మేకను దొంగిలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తా..?
ప్రతీకాత్మక చిత్రం
Odisha Cop Steals Goat: డిసెంబరు 31 రోజు కొందరు పోలీసులు పార్టీ చేసుకున్నారు. మేకలు కోసి..డిన్నర్ పార్టీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ మేకలు కొనుగోలు చేసినవి కాదు.. కొట్టుకొచ్చినవి
డిసెంబరు 31 అంటే అందరికీ పండగ రోజు. కొత్త ఏడాది (New Year)కి ఘన స్వాగతం పలికేందుకు అంతా పార్టీలు చేసుకుంటారు. కాశ్మీర్ నుంచి కాన్యాకుమారి వరకు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. విందు వినోదాల్లో పాల్గొంటారు. మందు పార్టీలు, మాంసాహార వంటకాలు, డీజే పాటల హోరు.. కేక్ కటింగ్ల జోరు.. ఆహా.. ఆ రోజు సందడి మామూలుగా ఉండదు. ఐతే అందరిలానే ఒడిశా (Odisha)లో కొందరు పోలీసులు పార్టీ చేసుకున్నారు. మేకలు కోసి..డిన్నర్ పార్టీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ మేకలు కొనుగోలు చేసినవి కాదు.. కొట్టుకొచ్చినవి (Odisha cop steals Goat). అవును మీరు చదివింది నిజమే. పోలీసులే దొంగల అవతారమెత్తారు. మేకలను కాజేసి.. పోలీస్ స్టేషన్ సాక్షిగా కోసేసి.. మటన్‌తో విందు పార్టీ చేసుకున్నారు. ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. డిసెంబరు 31న అంతటా పండగ వాతావరణం ఉంటే.. ఆయన మాత్రం రోజూలాగే మేకలను మేపేందుకు వెళ్లాడు. ఐతే మధ్యాహ్నం తర్వాత తన మేకల మందలో రెండు మేకలు అదృశ్యమయ్యాయి. చుట్టుపక్కల అంతటా వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. వారు మేకలను మేపే ప్రాంతానికి సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ రెండు మేకలను కోస్తుండగా సంకీర్తన గురు కూతురు చూసింది. వెంటనే తన తండ్రికి చెప్పంది. అవి మన మేకలేనని.. పోలీసులు కోస్తున్నారని వివరించింది. సంకీర్తన గురు వెంటనే గ్రామస్తులను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిబ్బందిని నిలదీశారు. అవి తమ మేకలని..దొంగిలించి విందు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఏం చేసుకుంటారో.. చేసుకోండని బెదిరించారు.
ఈ విషయం మీడియా ద్వారా జిల్లా ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లింది. పోలీస్ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. పోలీసులదే తప్పు అని తేల్చారు. నిజంగానే వారు మేకలను దొంగిలించారని తేల్చారు. అనంతరం ఏఎస్ఐ సుమన్ మల్లిక్‌ను సస్పెండ్ చేశారు. బాధ్యత గల పోలీస్ అయి ఉండి మేకలను దొంగతనం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ శాఖకే మచ్చ తెచ్చారని వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. జీతం వేలల్లో వస్తుంది కదా.. విందు కోసం ఇంత కక్కుర్తి పడాలా? పోలీసుల పరువు తీశారంటూ స్థానికులు కూడా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారి వల్లే డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తోందని.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.