సెల్ఫీ(Selfie) పిచ్చిలో పడి యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు వింత వింత ప్రయోగాలతో ఫోటోలు తీసుకుంటూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. అటువంటి సెల్ఫీ సరదాకు ఓ యువతి నిండు ప్రాణం బలైంది. ఈ విషాదకర ఘటన ఒడిశా(Odisha)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఇయర్ సందర్భంగా మిత్రులతో కలిసి పిక్నిక్(Picnic )కు వెళ్లింది రాజ్గంగ్పూర్(Rajgangpur) సమీపంలోని కుంభర్పాడ(Kumbharpada)కు చెందిన 27 ఏళ్ల అనుపమ ప్రజాపతి (Anupama Prajapati) అనే యువతి. ఆ యువతి సుందర్గడ్ జిల్లాలోని ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ కనకుండ్ వద్ద మిత్రులతో కలిసి నదీ(River) ఒడ్డున సెల్ఫీలు దిగుతుండగా.. కాలు జారి నదిలో పడిపోయింది. దీంతో, బలమైన ప్రవాహంతో వస్తున్న నదీ నీటిలో తక్షణమే కొట్టుకుపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు 22 గంటల సమయం పట్టింది.
ఆమె అదృశ్యమైన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో గల రాళ్ల మధ్య మృతదేహం కనుగొనబడిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో దేశంలో సెల్ఫీ మరణాలు పెరుగుతున్నాయి. 2018లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2011 అక్టోబర్ నుండి 2017 నవంబర్ వరకు దాదాపు 259 మరణాలు జరగ్గా.. వాటిలో అత్యధిక మరణాలు భారతదేశంలోనే జరిగాయని తేలింది.
రైలుపై సెల్ఫీ దిగుతుండగా..కాలిబూడిదైన బాలుడు
డిసెంబర్ నెలలో ఇటువంటి దుర్ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒడిషాలోని స్థానిక రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు(Train)పై సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన 13 ఏళ్ల పాఠశాల విద్యార్థి హైవోల్టేజ్ ఎలక్ట్రిక్ లైనును పట్టుకోవడంతో మంటల్లో చిక్కి పూర్తిగా కాలిపోయాడు. ఈ ఘటనలో ప్యాసింజర్ రైలు రెండు బోగీలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి.
సెల్ఫీ కారణంగా 2017లో నాగ్‌పూర్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. మొత్తం 11 మంది ప్రయాణిస్తున్న ఒక పడవ(Boat)లో అందరూ సెల్ఫీలు తీసుకుంటుండగా బ్యాలెన్స్ తప్పి సరస్సు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. ఇటువంటి ఘటనే పాకిస్తాన్(Pakistan )లోనూ చోటుచేసుకుంది. 50 ఏళ్ల ఒక వ్యక్తి లాహోర్(Lahore) కోటలోని 200 అడుగుల గోడపై నిల్చొని సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా, ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ, యువతలో సెల్ఫీ పిచ్చి తగ్గకపోవడం ఆందోళనకర పరిణామమని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha